AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు క్లారిటీ.. రుషికొండ భవనాలను చివరికి ఎలా చూడబోతున్నారో తెలుసా..?

విశాఖలోని రుషికొండ కొండపై నిర్మించిన ఆ విలాసవంతమైన భవనాల భవితవ్యం ఎట్టకేలకు తేలబోతోంది. గత ప్రభుత్వం వాటిని నిర్మించినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఈ నిర్మాణాలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో బస చేసేందుకు నిర్మించిన విలాసవంతమైన భవనాలంటూ అధికార పక్షం తీవ్ర విమర్శలు చేసింది. ఎట్టకేలకు భవనాల వినియోగంపై క్లారిటీకి వచ్చి కూటమి సర్కార్.

ఎట్టకేలకు క్లారిటీ.. రుషికొండ భవనాలను చివరికి ఎలా చూడబోతున్నారో తెలుసా..?
Vizag Rushikonda Structures
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jul 03, 2026 | 8:26 AM

Share

విశాఖలోని రుషికొండ కొండపై నిర్మించిన ఆ విలాసవంతమైన భవనాల భవితవ్యం ఎట్టకేలకు తేలబోతోంది. గత ప్రభుత్వం వాటిని నిర్మించినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఈ నిర్మాణాలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో బస చేసేందుకు నిర్మించిన విలాసవంతమైన భవనాలంటూ అధికార పక్షం తీవ్ర విమర్శలు చేసింది. ఎట్టకేలకు భవనాల వినియోగంపై క్లారిటీకి వచ్చి కూటమి సర్కార్.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన తర్వాత ఈ భవనాలను ఏం చేయాలి..? ప్రజల కోసం ఎలా వినియోగించాలి..? ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఎలా ఉపయోగించాలి..? అనే అంశాలపై రెండేళ్లుగా కసరత్తు జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఐదుసార్లు సచివాలయంలో సమావేశాలు, ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రుల సందర్శన, స్థానిక ప్రజలు, పర్యాటక రంగ నిపుణులు, స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాల సేకరణ.. ఇలా సుదీర్ఘ ప్రక్రియ తర్వాత కేబినెట్ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) కీలక అడుగు వేసింది. “ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI)” విడుదల చేస్తూ.. రుషికొండ భవనాల భవిష్యత్ వినియోగంపై ప్రభుత్వం ఆలోచిస్తున్న దిశను స్పష్టం చేసింది.

హోటల్‌గా.. టూరిజం హబ్‌గా..!

EOI డాక్యుమెంట్‌ను పరిశీలిస్తే.. ప్రభుత్వం ఈ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలుగా గానీ, అధికారుల నివాసాలుగా గానీ కాకుండా.. ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ, టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. లీజ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) మోడల్‌లో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ఏపీటీడీసీ ప్రతిపాదించింది. ఇప్పటికే నిర్మించిన ఐదు బ్లాకులను నిర్వహించడం, మార్కెటింగ్ చేయడం, వాణిజ్యపరంగా వినియోగించడం మాత్రమే కాకుండా.. అవసరమైన చోట అదనపు అభివృద్ధి చేపట్టే అవకాశం కూడా ఇవ్వాలని డాక్యుమెంట్‌లో పేర్కొంది. హోటల్ చైన్లు, రిసార్ట్ డెవలపర్లు, అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థలు, టూరిజం రంగంలో అనుభవం ఉన్న కంపెనీల నుంచి ఆసక్తి పత్రాలు ఆహ్వానించడం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రొఫెషనల్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కేవలం భవనాలు కాదు.. మరో 9 ఎకరాల విస్తరణ!

ప్రస్తుతం కొండపై ఉన్న సుమారు 9.8 ఎకరాల భవన సముదాయంతో పాటు.. కొండ దిగువన ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా అభివృద్ధిలో భాగం చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. హిల్‌టాప్‌లో ఇప్పటికే నిర్మించిన ఐదు భవనాల నిర్వహణతో పాటు.. అడుగు భాగంలో ఉన్న భూమిలో హోటళ్లు, రిసార్టులు, పర్యాటక సదుపాయాల నిర్మాణానికి అవకాశం కల్పించనుంది. ఇందుకు అవసరమైన సీఆర్‌జెడ్ నిబంధనలు, ఇతర చట్టబద్ధ అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని EOIలో స్పష్టం చేసింది. దీంతో భవిష్యత్తులో రుషికొండ ప్రాంతం మొత్తం సమగ్ర టూరిజం జోన్‌గా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రజలకు ప్రవేశం.. పర్యాటకానికే ప్రాధాన్యత!

తాజాగా విడుదల చేసిన EOI డాక్యుమెంట్‌లో అత్యంత ఆసక్తికర అంశం.. ప్రజలకు ప్రవేశంపై ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత. గతంలో ఈ భవనాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ప్రజల కోసం వ్యూయింగ్ ఏరియాలు, ప్రొమెనేడ్లు, ఓపెన్ స్పేస్‌లు, కల్చరల్ స్పేస్‌లు, పబ్లిక్ యాక్సెస్ టూరిజం సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా ప్రాజెక్టు రూపొందించాలని ఏపీటీడీసీ సూచించింది. అంటే ఇది పూర్తిగా ప్రైవేట్ హోటల్‌గా మారిపోదు.. ప్రజలకు అందుబాటులో ఉండే పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

అదనపు నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్

ప్రస్తుతం ఉన్న భవనాలతో పాటు.. రెండు ఖాళీ స్థలాల్లో అదనపు నిర్మాణాలకు కూడా అవకాశం కల్పించనుంది. మొత్తం 2,400 చదరపు మీటర్ల ఖాళీ స్థలంలో సుమారు 4,800 చదరపు మీటర్ల వరకు జీ+1 నిర్మాణాలు చేపట్టవచ్చని డాక్యుమెంట్ పేర్కొంది. అయితే ఇవన్నీ సీఆర్‌జెడ్, స్థానిక ప్రణాళిక నిబంధనలు, ఇతర అనుమతులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అంటే ఇప్పటికే నిర్మించిన భవనాల వినియోగంతో పాటు.. పర్యాటక అవసరాలకు అనుగుణంగా మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే అవకాశం కూడా కల్పిస్తోంది.

ప్రభుత్వ ఆలోచన ఇదేనా..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవనాలపై రాజకీయ విమర్శలు చేస్తూనే వాటిని ప్రభుత్వానికి భారంగా కాకుండా, ఆదాయం వచ్చే ఆస్తులుగా మార్చాలన్న దిశగా అడుగులు వేస్తోంది. మంత్రుల కమిటీ పరిశీలనలు, ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు, ఇప్పుడు విడుదలైన EOIని పరిశీలిస్తే.. ఈ భవనాలను ప్రపంచ స్థాయి టూరిజం, హాస్పిటాలిటీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా వినియోగించాలన్న దిశగానే ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. కేబినెట్ తుది ఆమోదం, అనంతరం RFP ప్రక్రియ పూర్తయితే.. రుషికొండ భవనాల భవిష్యత్తుపై చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడే అవకాశం ఉంది.

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us