Amaravati: అమరావతిలో గూగుల్ క్యాంపస్..! భూమిని పరిశీలించిన కంపెనీ ప్రతినిధులు
గూగుల్‌లో వెతికితే అమరావతి కనిపించడం కాదు.. అమరావతిలోనే గూగుల్ కొలువు తీరబోతోంది. గూగుల్ కంపెనీని మెప్పించి ఒప్పించి అమరావతిలో ఏర్పాటు చేయించేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని టాప్ కంపెనీ రాకతో అమరావతి అభివృద్ధి మరింత పరుగులు పెట్టడం ఖాయమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గూగుల్ సంస్థ అడుగుపెట్టబోతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కానుంది. అమరావతి రీజియన్ పునర్నిర్మాణానికి ఈ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి రాజధాని వేగంగా అభివృద్ధి చెందాలంటే గూగుల్, క్వాంటమ్ వ్యాలీ లాంటి కీలక ప్రాజెక్టుల్ని త్వరగా స్థాపించాలన్నది చంద్రబాబు సర్కార్ ఉద్దేశం. ఇందులో భాగంగా ఏకంగా గూగుల్ కంపెనీని మెప్పించి ఒప్పించి అమరావతిలో ఏర్పాటు చేయించేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు దాదాపుగా సత్ఫలితాలు ఇస్తున్నాయనే చెప్పాలి. ఈ క్రమంలో అనంతవరం నెక్కల్లు మధ్యలో అమరావతి ప్రధాన రహదారి ఈ-8 పక్కన సర్వే నెంబర్లు 10, 12, 13, 15, 16ల్లో ఉన్న సుమారు 143 ఎకరాల స్థలాన్ని గూగుల్‌కు కేటాయించేందుకు CRDA ముందుకొచ్చింది.
ఎయిర్‌పోర్టు, రైల్వే జంక్షన్‌కు దగ్గరగా ఈ ప్రాంతం
ఈ ప్రాంతం అటు విమానాశ్రయం, రైల్వే జంక్షన్, గుంటూరు – విజయవాడ హైవే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రదేశంగా భావిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సంస్థ ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులతో కలిసి నెక్కల్లు ప్రాంతంలో భూమిని పరిశీలించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ స్థలం అనుకూలంగా ఉంటుందా అన్న దానిపై మౌలిక సదుపాయాలను అధ్యయనం చేసినట్టు సమాచారం. మొదటి విడతగా డేటా సెంటర్, ఐటి సర్వీసుల కేంద్రం, ఆఫీసు క్యాంపస్ నిర్మాణానికి గూగుల్ ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది.
అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ నగరంగా అభివృద్ధి చేసే ప్లాన్
అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ, ఆర్థిక, పాలనాపరమైన కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్పష్టమైన సంకల్పం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, నూతన మౌలిక వసతులు ఆవిర్భవించనున్నాయి. గూగుల్ రాకతో రాష్ట్రాన్ని మరింత ప్రముఖ కంపెనీలు తరలివస్తాయని.. అమరావతి బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతోందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. క్వాంటమ్ వ్యాలీకి ఇది కలిసొచ్చే అంశమని యోచిస్తోంది. గూగుల్ క్యాంపస్‌లో డేటా సెంటర్‌లు, ఆపరేషన్ టవర్లు, ఇన్నొవేషన్ లాబ్స్, రీసెర్చ్ హబ్‌లు ఏర్పాటవుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే… దాదాపు 8 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




