Eluru: వసతి గృహం మాటున బాలికలను కాటేసిన మారీచుడు.. కట్టేసి మరీ
ఏలూరులో దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ నిర్వాహకుడు కామ పిశాచిలా మారిపోయాడు. చదువుకునేందుకు వచ్చిన బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
తమిళనాడులో స్వామి దయానంద సరస్వతి అనే సంస్థ ఆల్ ఇండియా మూమెంట్ ఫర్ సేవా అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థినులకు ఉచిత హాస్టల్, నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఏపీలోనూ ఈ సంస్థ 10 వసతిగృహాలను ఏర్పాటు చేసింది. ఏలూరులోనూ ఓ హాస్టల్ నిర్వహిస్తోంది. ఇక్కడ 50 మంది విద్యార్థినులు షల్టర్ తీసుకుని పలు విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా స్వామిజీ హాస్టల్ బాధ్యతలను శశి కుమార్‌కు అప్పగించారు. శశికుమార్ ఎర్రగుంటపల్లి బీసీ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుండటంతో అతడిని నమ్మి ఇక్కడి బాధ్యతలు అప్పగించారు స్వామిజీ. వసతి గృహ బాధ్యతలు తీసుకున్న శశి కుమార్ తన రెండో భార్య మణిశ్రీ, మేనకోడలు లావణ్యను వార్డెన్లుగా నియమించాడు. వారి సహకారంతో బాలికల పట్ల ఉన్మాదంతోప్రవర్తించాడు శశికుమార్. తమపై శశికుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడని బాలికలు ఆరోపిస్తున్నారు. ఫొటో షూట్ పేరుతో తమను ఔట్ డోర్స్‌కు తీసుకెళ్లి వికృత చేష్టలకు పాల్పడేవారన్నారు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి పాల్పడేవాడని, కొట్టేవాడని తమ బాధను ఏకరువు పెట్టారు. ఇదే విషయాన్ని ఓ బాధితురాలు స్నేహితులతో చెప్పిందనే కారణంతో అందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టారని విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు.
శశికుమార్ అరాచకాలను భరించలేని ముగ్గురు బాలికలు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధిత బాలికల బంధువులతో వెళ్లి శశికుమార్‌పై ఏలూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ శ్రావణ్‌కుమార్ బాలికల హాస్టల్‌కు వెళ్లి స్టేట్ మెంట్ తీసుకున్నారు. శశికుమార్ అతనికి సహకరించినవారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శశికుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిసింది.