
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు టీడీపీలో అసమ్మతి కుంపటి రోజురోజుకూ మండుతోంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు గిడ్డి ఈశ్వరి తాజాగా ప్రకటించారు. ఐదేళ్లు ఖర్చు పెట్టుకుని, కష్టపడితే టికెట్ వేరే వాళ్లకు ఇచ్చి మోసం చేశారంటూ అవేదన వ్యక్తం చేసిన ఈశ్వరి కార్యకర్తల అభిప్రాయాల మేరకే రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేసే పాడేరు నియోజకవర్గంలో రెబల్ గెలుపుకు కృషి చేయాలని కోరారు గిడ్డి ఈశ్వరి. పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాల కార్యకర్తలతో కుమ్మరిపుట్టులోని తన నివాసంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఇందులో నియోజకవర్గంలోని క్రియాశీలక నేతలంతా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్యకర్తలందరూ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని రెబల్‌గా మిమ్మల్ని గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. పార్టీకి ఏం ద్రోహం చేసానో కానీ పాడేరు నియోజకవర్గంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి నేడు గెలవబోతున్నాం అనేసరికి వేరొక వ్యక్తికి టికెట్ కేటాయించి కార్యకర్తలను ఇబ్బందులకు గరిచేశారనీ అవేదన వ్యక్తం చేశారు గిడ్డి ఈశ్వరి. కార్యకర్తల అభిప్రాయాల మేరకు నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసే రెబల్‌గా గెలిచి తెలుగుదేశం పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. ప్రతి కార్యకర్త నేటి నుండి రెబల్ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి పోటీ చేయుచున్నారని ప్రచారం జోరుగా చేయాలని ఆమె కార్యకర్తలను సూచించారు.
ఈ రెబెల్ సమావేశంలో నియోజకవర్గానికి, జిల్లాకు చెందిన టీడీపీ క్రియాశీలక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్లంతా చాలా ఆవేశంగా మాట్లాడారు కూడా. పాడేరు నియోజకవర్గంలో గిడ్డి ఈశ్వరి గెలుపునకు రాత్రులు పగలు కష్టపడి గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు పి గోవిందరావు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగ పూజారి శివకుమార్, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు డప్పోడి వెంకటరమణ, చింతపల్లి జిమాడుగుల మండల అధ్యక్షులు కిల్లో పూర్ణచంద్రరావు వంతల కొండలరావు, మొక్కల రమేష్, ప్రధాన కార్యదర్శులు తోట వీర వెంకట సత్యనారాయణ, లక్ష్మణరావు, క్లస్టర్ ఇన్చార్జులు చిరంజీవి, పాండురాజు, లకే రామకృష్ణ, జి మాడుగుల సూపర్ ఎంపీపీ కొర్రా కొండ బాబు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తల పాల్గొనడం విశేషం.
2014లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి 2019 ఎన్నికల ముందు ఆ పార్టీకి రాజీనామా చేశారు గిడ్డి ఈశ్వరి. ఆ తరువాత టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఐదేళ్లు పార్టీ నిర్వహణ ఖర్చంతా భరించారు. అయితే తీరా ఎన్నికలు వచ్చేసరికి తనకు కాకుండా ఇటీవల టీడీపీలో చేరిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిళ్ళు వెంకట రమేష్‌కు టీడీపీ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి మొదట పాడేరు బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఆఖరి నిమిషంలో బీజేపీ అరకు అసెంబ్లీ తీసుకోవడంతో పాడేరులో టీడీపీ మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో ఈశ్వరి బదులు వెంకట రమేష్‌కు టికెట్ కేటాయించడంతో ఈశ్వరి వర్గీయులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తామని ప్రకటించారు. అనుకున్నట్టుగానే రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు కూడా. తాజా పరిణామంతో ఎన్నికలకు ముందే పాడేరులో తీవ్ర రాజకీయ పరిణామం వెలుగుచూసినట్టైందన్న ప్రచారం గట్టిగా సాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..