AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raptadu: సీమ జిల్లాలో వైసీపీ స్ట్రాటజీ.. పరిటాల సునీతపై పోటీకి భానుమతి?

సీమలోని ఆ జిల్లాలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. విపక్షపార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గంలో మహామహుల్ని కాదని మహిళానేతకు పార్టీ పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు మరో కీలక నియోజకవర్గంలోనూ మహిళా నేతను తెరపైకి తెస్తున్నారా? సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నా ఆ సీటునుంచి ఈసారి మహిళా అభ్యర్థిని బరిలోకి దించబోతున్నారా? కేవలం ఊహాగానాలేనా? చివరికి జరగబోయేది అదేనా?

Raptadu: సీమ జిల్లాలో వైసీపీ స్ట్రాటజీ.. పరిటాల సునీతపై పోటీకి భానుమతి?
Gangula Bhanumathi
Ram Naramaneni
|

Updated on: Sep 16, 2023 | 5:35 PM

Share

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. ప్రధానంగా రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ వ్యూహాలు ఊహకందడం లేదు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్థానంలో ఈసారి వైసీపీ నుంచి మహిళా అభ్యర్థి బరిలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూరేలా రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న మద్దెలచెరువు సూరి భార్య రాప్తాడు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ప్రతక్ష్యమవ్వటంతో మరోసారి గంగుల భానుమతి యాక్టివ్ అవుతున్నారా అన్న చర్చ మొదలైంది. రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై చెప్పిన గంగుల భానుమతి ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సాహంతోనే మరోసారి యాక్టివ్ అవుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. గంగుల భానుమతి మరోసారి పోటీ చేస్తారన్న ఊహగానాలను కొట్టి పారేయలేమన్నట్లు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2004 ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్ర పై పోటీచేసి ఓడిపోయారు గంగుల భానుమతి. ఆ తర్వాత భానుమతి రాజకీయాలకు దాదాపుగా దూరంగానే ఉన్నారు. ఉన్నట్టుండి రాప్తాడు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో గంగుల భానుమతి ప్రత్యక్షమవ్వడంతో మరోసారి పరిటాల కుటుంబంపై గంగుల భానుమతి పోటీ చేస్తారా అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.

గంగుల భానుమతిని రాప్తాడునుంచి దించాలనుకుంటే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ కూడా తెరపైకొచ్చింది. జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు గ్యాప్‌ పెరిగిందన్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి కొన్ని పరిణామాలు. తనకు తెలియకుండా నియోజకవర్గంలో చాలా పనుల్లో ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి జోక్యం చేసుకుంటున్నారన్న భావనతో ఉన్నారట ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు, ఎమ్మెల్యేకి అధికారులు సహకరించడం లేదన్న ప్రచారం దీనికి బలం చేకూరుస్తోంది. గాయత్రీ డెయిరీకి భూముల కేటాయింపు విషయం కూడా తోపుదుర్తికి తెలియకుండానే జరిగిందన్నది ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్న మాట. ఇంచార్జి మంత్రి జోక్యం ఎక్కువైందని ఎమ్మెల్యే తోపుదుర్తి కొంత కినుకు వహిస్తున్నట్లు నియోజకవర్గ నేతల్లో చర్చ జరుగుతోంది.

నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి జోక్యం చేసుకోవటంతో పాటు గంగుల భానుమతిని ప్రోత్సహిస్తున్నారన్న భావనతో ఉన్నారట రాప్తాడు ఎమ్మెల్యే. ఒకవేళ భానుమతినే బరిలోకి దించాలనుకుంటే.. తోపుదుర్తికి అధిష్ఠానం ఎక్కడ అవకాశం ఇస్తుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ రాజకీయ సమీకరణాల్లో భాగంగా మార్పులు జరిగితే తోపుదుర్తిని పెనుకొండ నియోజకవర్గంనుంచి దించొచ్చన్న చర్చ నడుస్తోంది. పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనకు టిక్కెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని కొందరు నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం శంకరనారాయణపై బాగా అసంతృప్తితో ఉంది. ఇలాంటి సమయంలో పెనుకొండకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే బెటర్ అన్న ఆలోచన వైసీపీ అధిష్ఠానం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అనంతపురం లేదా హిందూపురం ఎంపీగా పోటీ చేయించే అవకాశం కూడా ఉందన్న మాట వినిపిస్తోంది. ఊహాగానాలు, చర్చలు ఎలా ఉన్నా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మనసులో ఏముంది, చివరికి ఏం జరగబోతోందన్న ఉత్కంఠయితే పెరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..