తిరుపతి లడ్డూపై నిజా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలిః వెంకయ్యనాయడు
ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదంపై రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుమల శ్రీవారి ప్రసాదాలు విషయంలో వస్తున్న వార్తలు భక్తులను కలవరానికి గురి చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదంపై రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో తిరుమలలో ఇష్టానుసారంగా వ్యవహరించారని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. నెయ్యి కాంట్రాక్ట్‌లను బట్టి చూస్తేనే ఏదో తప్పు జరిగిందని అర్థమవుతోందన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అయితే ఈ వివాదంలో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ మండిపడుతోంది.
మరోవైపు తిరుమల శ్రీవారి ప్రసాదాలు విషయంలో వస్తున్న వార్తలను చూసి ఎంతగానో కలచివేశాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ విషయంపై ఫోన్‌లో మాట్లాడానన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారని, కోట్లా మందికి శ్రీవారు ఇంటి ఇలవేల్పు అని మాజీ ఉప రాష్ట్రపతి గుర్తు చేశారు. కోట్లాదిమంది భక్తులు మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల లడ్డు ప్రసాదాలు తయారు చేశారని వార్తలు రావడం తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు.
తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు. ఆ స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరించటం మాత్రమే కాదు, వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశీస్సులు ఈ ప్రసాదం ద్వారా లభించాలని, పంచటం మన పెద్దల నుంచి ఆచారంగా వస్తోందన్నారు వెంకయ్య. ఇంతటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం వున్న తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత మరింత కీలకమన్నారు. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమార్హం కాదన్న మాజీ ఉప రాష్ట్రపతి.. నిజా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రికి సూచించారు. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రిని కోరానన్నారు.
తిరుమల శ్రీవారి ప్రసాదముల తయారీ విషయంలో వస్తున్న వార్తలు నన్ను ఎంతగానో కలచివేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయం గురించి ఫోన్‌లో మాట్లాడాను.
తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు. ఆ స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ… pic.twitter.com/wZnL4jVxTJ
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 20, 2024
ఇదిలాఉండగా, పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో భేటీ అయ్యారు. ఆలయ సంప్రోక్షణపై సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది. దీనిపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, పండితులతో టీటీడీ ఈవో శ్యామల రావు చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




