Andhra Pradesh: సూడాన్ టూ చిత్తూరు.. డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన ఏపీ పోలీసులు.. ఆరుగురు అరెస్ట్..

కాలేజీ విద్యార్ధులు, యువతను మత్తుకూపంలోకి దింపే డర్టీ గ్యాంగ్ కథకు ఏపీ పోలీసులు చెక్ పెట్టారు. ఎప్పటినుంచో సాగుతున్న ఈ గుట్టు సామ్రాజ్యాన్ని చిత్తూరు పోలీసులు ఛేదించి.. సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.

Andhra Pradesh: సూడాన్ టూ చిత్తూరు.. డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన ఏపీ పోలీసులు.. ఆరుగురు అరెస్ట్..
Drugs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2022 | 9:29 PM

యువతను మత్తుకు బానిసను చేయడం.. రూ. లక్షల్లో దండుకోవడమే వీళ్ల పని.. చాకెట్ల లాంటి పొట్లాల్లో డ్రగ్స్.. ఇంకా వాటిని శరీరంలోకి ఎక్కించుకునేందుకు సిరంజిలతో సహా అన్నీ సప్లై చేస్తారు. కాలేజీ విద్యార్ధులు, యువతను మత్తుకూపంలోకి దింపే డర్టీ గ్యాంగ్ కథకు ఏపీ పోలీసులు చెక్ పెట్టారు. ఎప్పటినుంచో సాగుతున్న ఈ గుట్టు సామ్రాజ్యాన్ని చిత్తూరు పోలీసులు ఛేదించి.. సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. సూడాన్ దేశానికి చెందిన అహ్మద్ ఒమర్‌తో పాటు మరో ఆరుగురిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయల విలువైన 34 గ్రాముల డ్రగ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో సిరంజిలు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు టూ టౌన్ పరిధిలోని ఇరువారం జంక్షన్‌లో MDMA డ్రగ్స్ సప్లై చేస్తుండగా పట్టుకున్నారు. సుడాన్‌కు చెందిన అహ్మద్ నుంచి చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం అరగొండకు చెందిన సిరాజ్‌కు డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లోని యువతకు విక్రయిస్తోందీ ముఠా. ప్రస్తుతానికి అహ్మద్ పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ రాకెట్‌లో ఇంకా ఎవరి హస్తం ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీనివెనుక మరికొందరి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

నిందితులను కె సిరాజ్ (37), అహ్మద్ ఒమర్ అహ్మద్ సయ్యద్ (28), కె సురేష్ (25), ఎస్ జయశంకర్ (32), సి ప్రతాప్ (26), ఎస్ తేజ కుమార్ (22)లుగా గుర్తించారు. ఈ ముఠాకు మద్దతుగా నిలిచిన మరో ముగ్గురిని వెంకటేష్, మోహన్, మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ వై.రిశాంత్‌రెడ్డి తెలిపారు. అహ్మద్ ఒమర్ అహ్మద్ సయ్యద్ సూడాన్ దేశస్థుడని.. స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చిన అతడు అప్పటి నుంచి బెంగళూరులో ఉంటూ డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..