
స్కూల్లో విద్యార్థులు మధ్య జరిగిన చిన్న చిలిపి పని ఓ విద్యార్థి తండ్రి కి కోపం తెప్పించింది. దాంతో నేరుగా స్కూలుకు వెళ్లి టీచర్లను నిలదీయడమే కాకుండా స్కూలు గేటుకి తాళం వేసి వెళ్లిపోయాడు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు స్కూలు యాజమాన్యం సిబ్బంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ హై స్కూల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.! ఉప్పాడ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న రవితేజ అనే విద్యార్ది తోటి విద్యార్ధులను సరదాగా ఆటపట్టిస్తూ ఎంతో చలాకీగా ఉంటాడు. శనివారం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుతో పాటు మరో టీచర్ సెలవు పెట్టడంతో, ఖాళీగా ఉండకుండా 6వ తరగతి విద్యార్థుల కి వర్క్ ఇచ్చి చేయమని చెప్పివెళ్లారు ప్రక్క క్లాస్ టీచర్. ఇంతలో రవితేజ 6వ తరగతి క్లాస్‌రూమ్ కి వెళ్లి ఇవాళ నేనే మీ క్లాస్ టీచర్ ని , అందరూ లేచి నాకు గుడ్ మార్నింగ్ చెప్పండి అంటూ సరదాగా అన్నాడు.
దాంతో విద్యార్ధులు కూడా ఎంతో సరదాగా అందరూ లేచి రవితేజకు గుడ్‌మార్నింగ్ చెప్పారు. వారిలో ఓ విద్యార్ధి మాత్రం లేచి నిలబడనూలేదు, గుడ్‌మార్నింగ్ కూడా చెప్పలేదు. దాంతో నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పవా అంటూ రవితేజ ఆ విద్యార్ధి దగ్గరకు వెళ్లి భుజాలు పట్టుకొని ఊపుతూ గుడ్‌మార్నింగ్ చెప్పాలని అడిగినట్టు తోటి విద్యార్ధులు చెబుతున్నారు. దానిని అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తండ్రి భాషాకు విషయం చెప్పడంతో.. కోపోద్రేకుడైన అతను స్కూలుకు వచ్చి ఉపాధ్యాయులపై కేకలు వేస్తూ వీరంగం సృష్టించాడు. వారు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా స్కూలు గేటు కు తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫోన్ లో సమాచారం అందించారు. వెంటనే పోలీసులు భాషాను తీసుకొచ్చి గేటు తాళం తీయించారు. బాషాను మందలించి వదిలేసారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.