తియ్యని బంగినపల్లి మామిడి మసక బారింది. మామిడి ప్రియులను నోరూరించే రసాలు జారిపోయాయి. ఏ తోటలో చూసిన రాలు కాయలు, మార్కెట్ కు వెలితే కొనే దిక్కులేక రోడ్లపైనే కాయ పారబోసిన దైన్యం నెలకొంది. ఈ యేడు మామిడి రైతు పడరాని కష్టం పడుతున్నాడు. మామిడిని కమ్మేసిన మంగు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పశ్చిమ లోని నూజివీడు ప్రాంత మామిడికి విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. పండ్లలో రారాజుగా పిలిచే మామిడికి నూజివీడు డివిజన్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. పంటలో దశాబ్దాలుగా పాటించిన మెళకువలు, ప్రత్యేక రకాల సాగులో సాధించిన నాణ్యమైన దిగుబడులు దేశ, విదేశాల్లో మామిడికి మంచి మార్కెట్ సృష్టించాయి. ప్రధానంగా రసాలు రకం నూజివీడు రసాలుగా ఖ్యాతి గడించాయి. అయితే ఈ ఏడాది వాతావరణ ప్రతికూలత మామిడి రైతులకు కష్టాలు మిగిల్చింది.
ఏలూరు జిల్లాలోని మెట్టప్రాంతాల్లోని పలు మండలాల్లో మామిడి సాగు అధికంగా ఉంది. వీటిలో ప్రధానంగా నూజివీడు డివిజన్ లోని నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడిలో మూడు ప్రత్యేక రకాలు ఆధికంగా సాగు చేస్తారు. మూడు నెలల పాటు సీజన్ ఉండే మామిడికి ఈ ఏడాది మార్చిలో వచ్చిన అకాల వర్షాలతో నాణ్యతతో కూడిన దిగుబడి తగ్గడం, పండ్లకు మంగు రావడంతో కాయలు చెట్లు కిందనే రాలిపోతున్నాయి. ఇలాంటి వాటిని కోసి మార్కెట్ కు తరలించినా కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో తోటలపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు.
సాధారణంగా బంగినపల్లి, తోతాపురి, పెద్ద రసాలు, చిన్న రసాలు, జలాలు, సువర్ణరేఖ తదితర రకాలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో సాగు చేస్తుంటారు. ఏలూరు, కృష్ణా జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.40 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేసినట్టు అంచనా. బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ రకాలు 80 శాతం తోటల్లో కాస్తుంటాయి. రైతులు పంటను తోటల నుంచి నేరుగా విజయవాడ ప్రాంతంలో నున్న ప్రధాన మార్కెట్తో పాటు ఏలూరు, నూజివీడు, ఆగిరిపల్లి మార్కెట్ లకు తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం జిల్లా నుంచి ఢిల్లీ, జలంధర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు మామిడి ఎగుమతి అవుతోంది. రెండేళ్ల క్రితం వరకు శ్రీలంక, సింగపూర్, దుబాయి, ఇంగ్లాండ్ దేశాలకు నూజివీడురసాలు, బంగినపల్లి పెద్ద ఎత్తున ఎగుమతులు ఉండేవి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో మామిడి పండ్లలో నాణ్యత లేకపోవడం తో పూర్తి దేశీయ, విదేశీ మార్కెట్లలో నూజివీడు మామిడి కి డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో టన్ను రూ.24 వేలు ఉన్న బంగిని పల్లి రూ.4వేలకు పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి అధికంగా పొగ మంచు, ఫిబ్రవరి, మార్చిలో కురిసిన వర్షాలతో మామిడి సాగుకు చాలా ఇబ్బంది కలిగింది. ఎక్కువ శాతం దిగుబడి రాకపోవడం, మంగు బెడదతో మార్కెట్ గణనీయంగా పడిపోయింది. అయితే ఇతర రాష్ట్రాల్లోనూ 20 ఏళ్ల క్రితం వరకు మామిడి మార్కెట్ దేశం లోనే కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండేది. అయితే,మామిడిలో పదుల సంఖ్యలో వెరైటీలు రావడం, ఇతర రాష్ట్రాల్లో కూడా సాగుపై ఆసక్తి పెరగడంతో మన పంటకు దేశీయ మార్కెట్ లో బలమైన పోటీ ఏర్పడింది. గత పదేళ్లుగా తెలంగాణలోని జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల్లోని రాతి నేలల్లో మామిడి సాగు పెరిగింది. అక్కడ కూడా ఇవే రకాలు సాగు చేస్తుండటంతో ఆన్లైన్ మార్కెట్ విదేశీ ఎగుమతుల అవకాశాన్ని అక్కడి వ్యాపారులు అందిపుచ్చుకుంటున్నారు. ఈ ప్రభావం నూజివీడు మామిడి పై పడింది. మరోవైపు ఈ ఏడాది సీజన్ అనుకూలంగా లేకపోవడంతో కేవలం నాణ్యమైన పంటకు మాత్రమే మంచి డిమాండ్ ఉంది. నూజివీడు బంగినపల్లిని మామిడి రారాజుగా పిలుస్తుంటారు. అధిక తీపి ఉండటం, సగటున వారం రోజుల వరకు కాయపాడవని గుణంతో దీని డిమాండ్ అలానే కొనసాగుతోంది. ఈ రకంలోను ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడం మామిడి రైతులకు నష్టం చేకూరే విషయమని చెప్పవచ్చును.
ఈ ఏడాది వర్షాల వల్ల పంట నాణ్యత తగ్గడంతో ధరలు ఆశాజనకంగా లేవని మామిడి రైతులు వాపోతున్నారు. చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి ధరలు బాగా తగ్గాయని, జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి డిమాండ్ ఉండటంతో టన్ను రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు పలుకుతోందని రైతులు అంటున్నారు. గత రెండు, మూడేళ్లు మామిడిలో మంచి లాభాలు వచ్చాయని ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా లాభాలు తగాయని చెబుతున్నారు. పంట ప్రారంభం నుంచి అధిక పెట్టుబడులు, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరో వైపు కోతకు కూలీలు సైతం రాకపోవటంతో కొందరు మామిడి కాయలు ఉచితంగా పంచేస్తుంటే మరికొందరు రోడ్లపక్కన పారబోస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..