AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ‘మండే’ ఆంధ్రా.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. జాగ్రత్తలు అవసరం

మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో మరింత ప్రభావం ఉండనుంది. మార్చి నుంచి మే వరకు శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందట.

AP News: 'మండే' ఆంధ్రా.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. జాగ్రత్తలు అవసరం
Summer Heat
Ravi Kiran
|

Updated on: Mar 01, 2025 | 7:48 PM

Share

రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే వేసవి కాలం ఎంట్రీ ఇచ్చిందా అన్నంతగా గత వారం 24న (ఫిబ్రవరి) నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో 38.6°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో సూర్యుడు మార్చి నెల నుంచే సుర్రుమనిపించనున్నాడు. ఏప్రిల్, మే లో సూర్యుడు మరింత మండనున్నాడు. భానుడు భగభగా మండిపోతున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు కక్కిస్తున్నాడు. బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు.

మార్చి, ఏప్రిల్‌, మేలో తీవ్రతరం..

ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొందని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్‌ తెలిపారు. మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు. తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుందన్నారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

ప్రాణ నష్టం జరగకుండా చర్యలు..

విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండతీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు. ఎండ తీవ్రత అంచనాల నేపధ్యంలో జిల్లా అధికారులు దృష్టి సారించాలని ఇప్చటికే సూచనలు జారీ చేశామన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై పర్యవేక్షిస్తామన్నారు. జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ లో ఎండ ప్రభావం చూపే మండల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు.

ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. ప్రజల ఫోన్లకు విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక సందేశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు. పిడుగులు పడనున్నందున చెట్ల క్రింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎండ ప్రభావానికి గురికాకుండా వేసవి జాగ్రత్తలు..

వేసవి కాలం ఎండ తీవ్రతకు గురికాకుండా దినసరి కూలీలు ఉదయంపూటనే పనులు పూర్తిచేసుకొని మధ్యాహ్నం నీడలో ఉండేలా చూసుకోవాలన్నారు. ఇక నుంచి మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలన్నారు. తెలుపు రంగు, పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, కర్చీఫ్ కట్టుకోవడం , టోపి పెట్టుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్‌ సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి