
విజయవాడ, డిసెంబర్ 23: భర్తతో కలిసి కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని సంపాదించిన వృద్ధురాలికి వృద్ధాప్యంలో దిక్కు లేకుండా పోయింది. భర్త మృతి చెందిన అనంతరం ఆయన తరపు బంధువులే ఆమె ఆస్తిని లాక్కొని వృద్ధురాలికి అన్నం పెట్టకుండా ఇంటి నుంచి జెంటివేయడంతో ఆమె జీవితం దయనీయంగా మారింది. వృద్ధాప్యంలో జారిపడి కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయం ప్రాంగణంలో చెట్టు కింద అచేతనంగా పడి ఉండడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె సమీప బంధువు వెంకటరత్నం అక్కడికి చేరుకొని వృద్ధాప్యం కారణంగా నీరసంతో పడిపోయిందని చెప్పడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.
వికాస్ నగర్ కి చెందిన వెంకాయమ్మ పొన్నూరు మండలం కొత్త పాలెం కు చెందిన సుబ్బారావుకు రెండో భార్య. పిల్లలు లేకపోయినా భర్తతో కలిసి వ్యవసాయం చేస్తూ కొత్తపాలెంలో ఒకటి పాయింట్ పదహారే ఎకరాల పొలం, 10 సెంట్లు భవనం, మరో 10 సెంట్లు ఖాళీ స్థలాన్ని సంపాదించారు. నాలుగేళ్ల క్రితం భర్త సుబ్బారావు మృతి చెందడంతో భర్త తరపు వారు ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకొని ఇంటి నుంచి గెంటి వేశారు.
ఆ తర్వాత వెంకాయమ్మను వెంకటరత్నం వికాస్ నగర్ కు తీసుకువెళ్లి సంరక్షిస్తున్నారు. ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్‌తో జీవనం సాగిస్తున్న ఆమె ఇటీవల జారిపడి కాలు విరిగింది. దీంతో ఆమె పూర్తిగా నడవలేని స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో తన ఆస్తిలో కొంత భాగం అయినా ఇప్పిస్తే దానిని అమ్ముకొని వైద్యం చేయించుకోవడంతో పాటు జీవనోపాధికి ఉపయోగపడుతుందని పోలీసులను ఆమె వేడుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి వృద్ధురాలికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.