Anakapalli: అనకాపల్లి దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేంద్రం, రాష్ట్రం
అనకాపల్లి జిల్లాలో క్రాకర్స్ తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఎనిమిది మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. మరికొంతమంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించాయి.

అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందగా..మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుల్లో ఎక్కువమంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది.
కోటవురట్ల మండల కేంద్రానికి 3 కి.మీల దూరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తారాజువ్వల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి షెడ్‌లు కూలిపోయాయి, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. క్షతగాత్రుల్లో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో పరిశ్రమలో 15మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం . ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు.
అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. మరోవైపు, ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో కలిసి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించారు.
అనకాపల్లి జిల్లాలో జరిగిన విషాదకర పేలుడు ఘటనపై అటు ప్రధాని మోదీ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరంగా, పీఎం సహాయనిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, బాణాసంచా తయారీలో ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటివి ప్రమాదానికి కారణాలని అధికారులు అనుమానిస్తున్నారు. పాత యంత్రాలు, సరైన వెంటిలేషన్ లేకపోవడం, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేకపోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.