AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ విడుదల చేసిన జగన్ సర్కార్..

AP Govt Employees DA:

CM Jagan: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ విడుదల చేసిన జగన్ సర్కార్..
CM Jagan
Sanjay Kasula
|

Updated on: Oct 22, 2023 | 7:52 AM

Share

అమరావతి, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్ ప్రకటిచింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మరో రెండు హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64 శాతం డీఏను విడుదల చేశారు.  రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్‌ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు పలు ప్రయోజనాలను అందజేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నామని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు క్యాజువల్ లీవులను మంజూరు చేశారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు డెయిరీ, రిపబ్లిక్ ఫోర్జ్ వంటి 54 ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) మూసి వేసిన టీడీపీ హయాంలో కాకుండా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 2,06,638 మంది పర్మినెంట్ ఉద్యోగులను నియమించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పెరిగిన కరువు భత్యం నవంబర్‌ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డీఏను నగదు రూపంలో డిసెంబర్‌ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై1 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌31 వరకు ఉన్న బకాయిలను మూడు దఫాలుగా జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో జమ చేయనున్నట్టు తెలిపారు. సీపీఎస్‌ ఉద్యోగులకు బకాయిల్లో 10 శాతం ప్రాన్‌ అకౌంట్‌లో జమ చేసి మిగిలిన 90 శాతం మూడు దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్‌ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు.

జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు, రివైజ్డ్‌ పేస్కేల్‌ 2022 కింద రెగ్యులర్‌గా జీతాలు అందుకుంటున్న వారు, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోని బోధన, భోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.