కూటమిలో గందరగోళం.. ఈ జిల్లాల నాయకుల్లో అసమ్మతి.. రెబల్‎గా పోటీకి సై..

నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ కూటమిలో టిక్కెట్ల వ్యవహారం కాకరేపుతోంది. టిక్కెట్లు దక్కని అసమ్మతి నేతలు నామినేషన్ల బాట పట్టడంతో కూటమికి బీటలు వారుతున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు.. అధిష్ఠానం ఆదేశాలను కూడా భేఖాతరు చేస్తూ ఎన్నికల బరిలో దిగుతుండడం ఏపీ పొలిటికల్‌ సీన్‌ను మార్చేస్తోంది.

కూటమిలో గందరగోళం.. ఈ జిల్లాల నాయకుల్లో అసమ్మతి.. రెబల్‎గా పోటీకి సై..
Tdp Bjp Janasena

Updated on: Apr 22, 2024 | 7:30 AM

నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ కూటమిలో టిక్కెట్ల వ్యవహారం కాకరేపుతోంది. టిక్కెట్లు దక్కని అసమ్మతి నేతలు నామినేషన్ల బాట పట్టడంతో కూటమికి బీటలు వారుతున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు.. అధిష్ఠానం ఆదేశాలను కూడా భేఖాతరు చేస్తూ ఎన్నికల బరిలో దిగుతుండడం ఏపీ పొలిటికల్‌ సీన్‌ను మార్చేస్తోంది.

ఏపీలో అసమ్మతి గళాలు కూటమి నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల కూటమి నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. నంద్యాల, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, కోడుమూరులో కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక.. రెండు, మూడు నియోజకవర్గాల్లో టీడీపీలోనే అంతర్గత పోరు జరగడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ వేయగా.. బీజేపీ తరఫున మురహరిరెడ్డి కూడా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ రెబల్‌గా నామినేషన్‌ వేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.

నంద్యాల టీడీపీలోనూ అసంతృప్తి భగ్గుమంటోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని.. టీడీపీ ఫరూక్‌కి టికెట్ ఇచ్చింది. దాంతో.. బ్రహ్మానందరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావిస్తున్నారు. మంత్రాలయంలో టికెట్ ఆశించి భంగపడ్డ తిక్కారెడ్డి వర్గం ప్రచారానికి దూరంగా ఉన్నారు. అటు.. కూటమి అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి.. బీజేపీ నేతలు, కార్యకర్తలను దూరం పెడుతున్నారని ఆ పార్టీ నేత పురుషోత్తంరెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. ఇక.. నందికొట్కూరు కూటమి అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం జయసూర్యని ప్రకటించగా.. టికెట్ ఆశించి భంగపడ్డవారు ప్రచారానికి దూరంగా ఉన్నారు. అభ్యర్థిని మార్చాలనే డిమాండ్‌ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాండ్ర శివానందరెడ్డిల మధ్య బిగ్‌ ఫైట్‌ నడుస్తోంది. కోడుమూరులోనూ సేమ్‌ పరిస్థితి నెలకొంది. విష్ణువర్థన్‌రెడ్డి వర్గానికి చెందిన దస్తగిరికి టీడీపీ టికెట్ ఇవ్వగా.. టీడీపీ ఇన్‌ఛార్జ్‌ గూడురు ప్రభాకర్‌ వర్గం ఆ పార్టీకి సహకరించకపోవడంతో టీడీపీ కేడర్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే.. టీడీపీ అధినేత బీఫామ్‌లు అందించగానే, సత్యసాయిజిల్లా మడకశిర టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అభ్యర్థి మార్పుతో మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు మండిపడ్డారు. మొదట సునీల్‌కుమార్‌కు టికెట్‌ ఇచ్చింది టీడీపీ అధిష్ఠానం. అయితే.. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెస్‌ రాజుకు భీఫాం ఇచ్చింది అధిష్ఠానం. సునీల్‌కుమార్‌కు భీఫాం ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయుల ఆందోళనకు దిగారు. మడకశిర టీడీపీ ఆఫీసు దగ్గర ఫ్లెక్సీలు చించివేశారు. ఎమ్మెస్‌ రాజు గో బ్యాక్‌ అంటూ సునీల్‌ వర్గీయుల నినాదాలు చేశారు.

అల్లూరి జిల్లా రంపచోడవరంలోనూ టీడీపీ అభ్యర్థి, రెబల్ అభ్యర్థి మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు అండగా ఉన్న తనకు కాకుండా మిర్యాల శిరీషకు అధిష్టానం టికెట్ ఇవ్వడంతో.. రెబల్‌గా పోటీ చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. రాజేశ్వరికి టికెట్ ప్రకటించాలని.. లేకుంటే రెబల్ అభ్యర్థిగా గెలిపించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు జిల్లా నాయకులు. చంద్రబాబు ఫోటోతోనే రెబల్‌గా పోటీ చేస్తానంటున్నారు వంతల. నెల్లూరు జిల్లా కావలిలోనూ రెబల్‌ రచ్చ ముదురుతోంది. కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్య క్రిష్ణారెడ్డి బరిలో దిగుతుండగా.. బీజేపీ నేత పసుపులేటి సుధాకర్ రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీని వీడి టీడీపీ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన.. చంద్రబాబు మోసం చేశారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు నిర్ణయించుకుని.. ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు పసుపులేటి సుధాకర్‌.

అటు.. జోరుగా ప్రచారం చేస్తున్న పసుపులేటి సుధాకర్‌ని టీడీపీ నేతలు బుజ్జగించినా ఫలితం దక్కలేదు. ఇదిచాలదన్నట్లు.. ఎన్నికల్లో పోటీ చేసి సత్తా ఏంటో చూపిస్తానన్నారు పసుపులేటి సుధాకర్‌. దాంతో.. కావలి టీడీపీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. కూటమిలో టిక్కెట్ల కుంపట్లు రచ్చకు దారితీస్తూనే ఉన్నాయి. అయితే.. కూటమి అగ్రనేతలు రంగంలోకి దిగి రెబల్స్‌ను బుజ్జగిస్తున్న నేపథ్యంలో.. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి విత్‌డ్రా చేసుకుంటారా?.. లేదా అన్నది చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..