Andhra: చూడండి చెడు అలవాట్లు మనిషిని ఎంత స్థాయికి తీసుకెళ్తాయో..
అప్పుల భారంతో కుంగిపోయిన ఓ యువకుడు చివరికి కిరాతకానికి తెగబడ్డాడు. బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఈశ్వరరావు… సొంత మేనత్తలాంటి వృద్ధురాలినే టార్గెట్ చేసి హత్య చేశాడు. వర్షం నెపంతో ఇంట్లోకి ప్రవేశించి, నమ్మకాన్ని ద్రోహంగా మార్చి బంగారం కోసం ప్రాణాలు తీశాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ దారుణం సంచలనం రేపుతోంది.

చెడు వ్యసనాలకు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు కిరాతకానికి పాల్పడ్డాడు. అప్పులు తీర్చేందుకు ఒంటరి మహిళను టార్గెట్ చేసి దారుణంగా హత్యచేసిన పార్వతీపురం మన్యం జిల్లాలో సంచలనంగా మారింది. మక్కువ మండలంలో మార్చి 20, 2026న మేళాపువలసకి చెందిన మేళాపు సింహాచలం (67) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు వృద్ధురాలి హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు హత్య జరిగిన రాత్రి ఆమె ఇంటి ముందు ఒక ద్విచక్ర వాహనం కనిపించిందని గ్రామస్తుల నుంచి కీలక సమాచారం తెలిసింది. ఆ ఆధారంగా పోలీసులు అనుమానితులపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే టెక్నాలజీ సహాయంతో ఈ నెల 28న అదే గ్రామానికి చెందిన చొంగలి ఈశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈశ్వరరావు బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్ తో పాటు జల్సాలకు పాల్పడి అప్పుల బారిన పడ్డాడు. అలా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈశ్వరరావు ఎలాగైనా అప్పులు తీర్చాలని ఒంటరిగా నివసిస్తున్న వరసకు మేనత్త అయిన సింహాచలంను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎలాగైనా సింహాచలంను హత్యచేసి ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బు కాజేసి అప్పులు తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. పక్కా స్కెచ్ వేసి ఈశ్వరరావు బైక్ పై ఆమె ఇంటికి వెళ్లాడు. హడావుడిగా లోపలకి వెళ్లి బయట వర్షం పడుతుందని, కాసేపు వర్షం తగ్గేవరకు ఉంటానని నమ్మించాడు. అలా నమ్మకంగా ఇంట్లోకి వచ్చిన ఈశ్వరరావు అదును చూసి సింహాచలం మెడ నొక్కి హత్య చేసి, ఆమె ఒంటి పై ఉన్న బంగారు గొలుసును అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన పై ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 11.700 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గ్రామాల్లో ఒంటరిగా నివసించే వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు చెప్తున్నారు..
