AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBN Focus on Key Officials: సెలవుపై వెళ్లిన సీఎస్‌.. ఏపీలో అధికారులపై మార్పుపై ఉత్కంఠ..!

ఆంధ్ర ప్రదేశ్‌లో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే సీఎం టీంలో ఉండే అధికారులు ఎవరు..? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు పాలనకు కేంద్ర బిందువైన ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య అధికారులు ఎవరు ఉంటారనే దానిపై చర్చ మొదలైంది.

CBN Focus on Key Officials: సెలవుపై వెళ్లిన సీఎస్‌.. ఏపీలో అధికారులపై మార్పుపై ఉత్కంఠ..!
CM Chandrababu
Follow us
pullarao.mandapaka

| Edited By: Balaraju Goud

Updated on: Jun 06, 2024 | 3:40 PM

ఆంధ్ర ప్రదేశ్‌లో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే సీఎం టీంలో ఉండే అధికారులు ఎవరు..? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు పాలనకు కేంద్ర బిందువైన ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య అధికారులు ఎవరు ఉంటారనే దానిపై చర్చ మొదలైంది. ఇప్పటికే సెలవుపై వెళ్లాలని ప్రస్తుత సీఎస్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సీఎస్‌ తోపాటు ఇతర అధికారుల నియామకంపై కాబోయే సీఎం కసరత్తు మొదలు పెట్టారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని అనుకున్నప్పటికీ, 12వ తేదీ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆలోచనతో ఉన్నట్లు తెలిస్తోంది. గత ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్రం 30 ఏళ్లు వెకబాటుకు గురైందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలనాపరంగా అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారట.

ఈ క్రమంలోనే తనతో పాటు తన కార్యాలయంలో పనిచేసే ముఖ్య అధికారులు ఎవరు ఉండాలనే దానిపై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న కేఎస్ జవహార్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎస్‌పై ఎన్నికల అధికారులకు తెలుగుదేశం పార్టీ అనేక ఫిర్యాదులు చేసింది. దీంతో సీఎస్ వ్యవహారంపై చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నారు. అంతేకాదు బుధవారం(జూన్ 5) చంద్రబాబును కలిసేందుకు వచ్చినా సీఎస్ జవహర్ రెడ్డి సుమారు అరగంట పాటు వేచి చూసిన తర్వాత మాత్రమే అవకాశం దొరికిందట. దీంతో సీఎస్ మార్పు ఆనివార్యంగా కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే సెలవుపై వెళ్లాలని సీఎస్ జవహర్ రెడ్డి సంకేతాలు పంపినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళుతున్నట్లు తెలిపిన సీఎస్.. GAD పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్‌ను లీవ్ కోరారు. సీఎస్ జవహర్ రెడ్డి సెలవు వెళ్లగానే కొత్త సీఎస్ నియామకం జరిగే అవకాశముంది. సాయంత్రానికి కొత్త సీఎస్ ను నియమించనున్నారు గవర్నర్. ఆయనతోపాటు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పలువురు కీలక ఐఏఎస్ అధికారులు సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. కొత్త సీఎస్‌ను సాయంత్రంలోపు నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కొత్త సిఎస్ గా ఎవరుంటారనే దానిపై అధికారుల్లో చర్చ మొదలైంది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి నీరప్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. సీఎస్ రేసులో నీరప్ కుమార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే నీరప్ కుమార్ బదులు మరొక సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ పేరు దాదాపు ఖరారు అయినట్టుగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది.1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన పేరు బలంగా వినిపిస్తోంది.

మరోవైపు సీఎంవోలోకి వచ్చే అధికారులపై కూడా చంద్రబాబు ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో పనిచేసిన సాయి ప్రసాద్, గిరిజా శంకర్ ను తిరిగి సీఎంవోలోకి తీసుకుంటారని చర్చ జరుగుతుంది. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సాయి ప్రసాద్ ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గా ఉన్నారు. ఇక 2008 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్ ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గా పనిచేస్తున్నారు. ఇక 2001 ఐఏఎస్ అధికారి సిద్ధార్థ జైన్ కూడా సీఎంవోలోకి వస్తారని తెలుస్తోంది. సర్వే సెటిల్మెంట్స్ – ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ గా సిద్ధార్థ జైన్ పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు అధికారులు చంద్రబాబుతో పాటు సీఎంవోలోకి రావడం దాదాపు ఖరారు అయినట్లేనని సచివాలయం అధికారుల్లో చర్చ జరుగుతుంది.

మరోవైపు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా చంద్రబాబును కలిసారు.. అయితే డీజీపీ మార్పు ఇప్పుడే ఉండదని తెలుస్తోంది. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామితులయ్యారు. ఒకవేళ డీజీపీని మార్చాల్సి వస్తే, ఆ స్థానంలో ద్వారకా తిరుమలరావును తీసుకుంటారని చర్చ జరుగుతుంది. హరీష్ కుమార్ గుప్తా విషయంలో చంద్రబాబు సంతృప్తికరంగానే ఉన్నట్లు కొంతమంది అధికారుల మధ్య చర్చ జరుగుతుంది. మొత్తానికి కీలకమైనటువంటి అధికారుల ఎంపిక విషయంలో చంద్రబాబు అత్యంత పకడ్బందీగా ముందుకెళ్తున్నారని సచివాలయ వర్గాల వినికిడి.

 మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…