Common krait: మాయదారి పాము.. మహా ప్రమాదకరం.. ముఖ్యంగా చలికాలంలో జాగ్రత్త
చలికాలంలో ఈ పాములు వెచ్చదనం కోసం ఇళ్లలోకి దూరతాయి. మనుషులు పొరపాటున తగిలితే వెంటనే కాటువేస్తాయి. కట్ల పాము కరిస్తే ఒక్కోసారి గాయం కనిపించదు. ఇది కాటు వేశాక చికిత్స అందకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగి.. మరణానికి దారితీస్తుంది ...

మన దేశంలో కనిపించే పాముల్లో కట్లపాము అత్యంత విషపూరితమైనది. దీనికి 4 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో విషపూరిత కోరలుంటాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి అంటే ప్రధానంగా చలికాలంలో ఇవి చాలా యాక్టివ్‌గా ఉంటాయి. రాత్రి వేళల్లో ఇవి వేటకు బయలుదేరతాయి. ఇది కాటు వేస్తే ఒక్కోసారి గాట్లు కూడా కనిపించవు. ప్రధానంగా ఇవి ముళ్ల పొదలు, గడ్డి వాములు, ఇటుకల కుప్పల్లో, బస్తాలు, పరదాల మాటన సేదతీరుతుంది. వెచ్చదనం కోసం ఇళ్లలోకి కూడా చేరి…గ్యాస్ బండలు, పైపులు వంటి వాటిలో నక్కుతాయి. ఇవి ఎలుకలను ఇష్టంగా తింటాయి. అందుకే ఎలుకల కలుగుల్లో కూడా దూరతాయి. ఇక నీటి కొలనులకు సమీప ప్రాంతాల్లో ఉండేందుకు ఇవి ఇష్టపడతాయి. విషపూరిత పాముల మాదిరిగా కాటు వేసేటప్పుడు ఇది ఎలాంటి సౌండ్ చేయదు. అందుకే అసలు దాన్ని గుర్తించలేం. కొన్నిసార్లు నిద్రలో ఇది కాటు వేస్తే.. తెల్లారేసరికి ప్రాణాలు పోతాయి.
కట్లపాము కాటువేసిన వెంటనే విషం విషం నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఈ పాము కాటు వేస్తే.. స్పృహ కోల్పోవడం, వాంతులు అవ్వడం, కడుపు నొప్పి, కళ్ళు తెరవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కట్ల పామును చనిపోయిన కొంతసేపటివరకు.. దాని నాడీ మండలం చురుగ్గా ఉండే అవకాశం ఉంది. అందువల్ల వాటిని చంపేసినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి.
