Cyclone Sitrang: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు.. తుపాను ముప్పు వారికే!
సిత్రాంగ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.
సిత్రాంగ్ తుపాను ఏపీతో సహా పలు రాష్ట్రాలను హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. అయితే సిత్రాంగ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి శనివారం (అక్టోబర్22) నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మొదట ఇది ఏపీ, ఒడిశా మధ్య తీరం దాటవచ్చని భావించారు. కానీ ఏపీ ఒడిశా తీరం వైపు వచ్చినా.. మధ్యలో దిశ మార్చుకుని ఉత్తర ఒడిశా పశ్చిమబెంగాల్ వైపు కదులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీలో గత 15 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. అదే సమయంలో పశ్చిమబెంగాల్ తీరంలో సముద్ర ఉష్ణోగ్రతలు ఇక్కడికంటే అధికంగా ఉన్నాయి. అందువల్ల తుపాను పశ్చిమబెంగాల్‌వైపు కదిలేందుకు ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు అధికారులు. వాతావరణంలో అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఏపీపై తుపాను ప్రభావం ఉండదని వాతావరణ శాఖ చెబుతోంది.
కాగా సిత్రాంగ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే వీలుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు, మూడు రోజులు ఇలాగే మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే.. తుపాను తీవ్రత, ఎక్కడ తీరాన్ని దాటుతుందన్నదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. 22తో పూర్తి స్పష్టత వస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం