Andhra: ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే.. బయటకొచ్చి చేసిన యవ్వారం ఇదా
ఎవరైనా నేరం చేస్తే.. చట్ట ప్రకారం పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని జ్యూడిషల్ రిమాండ్‌కు పంపిస్తారు. ఒకసారి ఒక నేరం చేసినవాడు.. మళ్లీ బయటికి వచ్చి కొంతమంది నేరాలు మానేస్తారు. మరి కొంతమంది.. తమ పాత అలవాటును కొనసాగిస్తారు. కానీ.. విశాఖ పోలీసులకు చిక్కిన ఓ మోసగాడు.

గాజువాకా చినగంట్యాడ ప్రాంతానికి చెందిన బలిరెడ్డి కుమారి నవంబర్ 28న న్యూ గాజువాకలోని ఎస్బీఐ ఏటీఎంకు నగదు ఉపసంహరణ కోసం వెళ్లారు. ఆమె ఏటీఎం లోపల ఉన్న సమయంలో టోపీ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ దగ్గరకు వచ్చాడు. ఆమె అతని సహాయాన్ని నిరాకరించారు. అయినా అతను వెనుక నిలబడి ఆమె పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు గమనించాడు. అటెన్షన్ డైవర్ట్ చేసి.. మోసపూరితంగా ఆమె ఏటీఎం కార్డును మార్పిడి చేశాడు. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయిన ఆమె.. మొబైల్ ఫోన్‌లో ఆమె ప్రమేయం లేకుండా డబ్బులు విత్ డ్రా చేస్తున్నట్టు మెసేజ్‌లు వచ్చాయి. అప్రమత్తమయ్యేసరికి దపదఫాలుగా రూ. 26,500 ఖాళీ అయ్యాయి. వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన గాజువాక క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి నేరాలు విశాఖ సిటీలో గాజువాక, దువ్వాడ, ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ల పరిధిలలో కూడా నమోదయ్యాయి. ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగి ఆధారాలను సేకరించారు. ఎట్టకేలకు గాజువాక మోహిని థియేటర్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఈ-కోర్నర్ ఏటీఎం కేంద్రాల వద్ద నిందితుడు బానోతు రాజు నాయక్‌ను అరెస్ట్ చేశారు.
అలా నేరాలు ప్రారంభించాడు..
రాజునాయక్.. స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్. ప్రస్తుతం నల్గొండ జిల్లా భాగ్యనగర్ కాలనీ. నిందితుడు బానోతు రాజు అలియాస్ నాయక్. విచారణలో కీలక విషయాలు పోలీసులకు తెలిసాయి. 2017లో ఓ నేరంలో వరంగల్ జైలులో ఉన్న సమయంలో అర్జున్ అనే నేరస్థుడితో పరిచయం ఏర్పడి.. అతని ద్వారా ఏటీఎం మోసాలు చేయడం ఎలా అనేదానిపై మెలకువలు నేర్చుకున్నాడు. ఏటీఎం కార్డులను సేకరించడం, అమాయకులను మోసం చేసి కార్డులను మార్పిడి చేయడం, సహాయం చేస్తున్నట్లు నటిస్తూ పిన్ నెంబర్లు తెలుసుకోవడం, తద్వారా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ చేయడం తెలుసుకున్నాడు. తన చెడు అలవాట్లకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో.. మోసాలు, దొంగతనాల ద్వారా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. 2022 నుంచి చిలకలగూడ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఏటీఎం కార్డు మార్పిడి ద్వారా దొంగతనాలు చేసి, దొంగిలించిన ఏటీఎం కార్డులతో నగదు ఉపసంహరణ చేశాడు. సుమారు ఆరు నేరాలు చేసిన తర్వాత, 2022లో చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల పాటు జైలులో ఉండి, 2023లో బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం మళ్లీ ఏటీఎం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని విశాఖలో కేసులు లేకపోవడంతో విశాఖ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో గాజువాకలో మోసానికి పాల్పడ్డాడు. నిందితుడు నుంచి రూ. 50,500 నగదు, 4 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఒక కేసులో గుట్టు విప్పితే..
ఇక.. పోలీసులు విచారిస్తే 12 నేరాల గుట్టు విప్పాడు. వాటిలో విశాఖ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో రెండు, దువ్వాడలో ఒకటి, ఎయిర్‌పోర్ట్ పీఎస్‌లో మరొకటి, ఏలూరు త్రీ టౌన్ పీఎస్ మరో నేరాన్ని ఇచ్చేసినట్టు ఒప్పుకున్నాడు. హైదరాబాద్ చిలకలగూడలో ఐదు నేరాలు, వరంగల్‌లో 1, మహబూబాబాద్ కేసముద్రంలో ఒక నేరాన్ని చేసినట్టు అంగీకరించాడు. ఏటీఎం సెంటర్‌కు వెళ్ళినప్పుడు వేరొకరి సహాయం తీసుకోవడం గాని, మరొకరు చూస్తూ ఉన్నప్పుడు పిన్ నెంబర్ ఎంటర్ చేయడం గానీ చేయకూడదని సూచిస్తున్నారు పోలీసులు.
