Vijayawada: సీపీఐ జాతీయ మహా సభలు.. ఎరుపు రంగు పులుముకున్న బెజవాడ..
కమ్యూనిస్టుల కంచుకోట బెజవాడ ఎర్రబారింది. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మైలురాయిలా నిలిచిన విజయవాడ నాలుగున్నర దశాబ్దాల అనంతరం మరోసారి ఎర్ర రంగుపులుముకుంది.

కమ్యూనిస్టుల కంచుకోట బెజవాడ ఎర్రబారింది. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మైలురాయిలా నిలిచిన విజయవాడ నాలుగున్నర దశాబ్దాల అనంతరం మరోసారి ఎర్ర రంగుపులుముకుంది. ఈనెల14 నుంచి 18 వరకు జరుగుతోన్న భారత కమ్యూనిస్టు పార్టీ 24 వ జాతీయ మహాసభలకు విజయవాడ వేదికయ్యింది. మహాసభల తొలిరోజు భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించారు సీపీఐ నేతలు. విజయవాడలో జరిగిన భారీ ప్రదర్శన.. ఎర్రసైన్యం కవాతుని తలపించింది. విజయవాడ నగర వీధులు ఎర్రపూలవనాన్ని తలపించాయి. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా జరిగిన భారీ ఊరేగింపులో ఎర్రజెండా రెపరెపలు గత చరిత్రను జ్ఞాపకం చేశాయి. కమ్యూనిస్టుల చారిత్రక గడ్డను మరింత ఎరుపెక్కించాయి. ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఊపునిచ్చాయి.
ఈ సభావేదిక నుంచి ప్రజావ్యతిరేక విధానాలపై ఎర్రజెండా కన్నెర్ర జేసింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో బెజవాడ హోరెత్తింది. సీపీఐ ఆల్ ఇండియా కాంగ్రెస్.. కేంద్రంలోని మతవాద శక్తులను గద్దెదించేందుకు లౌకిక వాద శక్తులన్నీ ఏకం కావాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా. మహాసభల సందర్భంగా వందల అడుగుల పొడవైన ఎర్రజెండాతో కార్యకర్తలు కవాతు చేశారు. సింగ్‌నగర్ స్టేడియం బహిరంగ సభలో పాల్గొనేందుకు 16 రాష్ట్రాల నుంచి నాయకులు తరలివచ్చారు. డప్పుల దరువులు, దారిపొడవునా.. మహిళా కామ్రేడ్స్ నృత్యాలు అలరించాయి. బీఆర్టీఎస్ రోడ్ నుంచి సింగ్ నగర్ వరకు భారీ ప్రదర్శనగా తరలివెళ్ళింది సీపీఐ జాతీయ నాయకత్వం.
సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ జాతీయ నేత నారాయణ, ఏపీ కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ సీపీఐ కార్యదర్శి కూనమనేని సాంబశివరావుతో పాటు ప్రధాన నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. అయితే, చిన్న షార్ట్ సర్క్యూట్‌తో బహిరంగ సభకి అంతరాయం ఏర్పడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ నిలిచిపోయింది. ఆ తరువాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా.. వర్షం కురుస్తుండడంతో జాతీయ కార్యదర్శి రాజా ప్రసంగం అనంతరం సభను ముగించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
