CPI Narayana : నా సలహా ఏంటంటే.. ‘కొత్తగా పెళ్లైన వాళ్లకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించండి’ : నారాయణ
మీరు కొత్తగా నిర్మించే ఇళ్లు.. మీ పార్టీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పినట్టు శోభనం గదికే ఉపయోగపడకపోతే, ఆ తర్వాత పిల్లలు పుడతారుకదా.. మరి వాళ్లేమవుతారు.
CPI Narayana Hot comments : ఏపీ ప్రభుత్వం కొత్తగా నిర్మించి ఇచ్చే ఇళ్లు సౌకర్యవంతంగా ఇవ్వాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని అయితే, తన మాట ఎవరూ వినకుండా తనకు కులాన్ని ఆపాదిస్తున్నారని వైసీపీ సర్కారుని సీపీఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. అయ్యే ఖర్చు ఎలాగూ అవుతుందన్న నారాయణ, దానికి ఇంకొంచెం ఖర్చుపెడితే ఆ ఇళ్లు సంసారం చేసుకోవడానికి.. పిల్లల్ని పెంచుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయని నారాయణ.. జగన్ సర్కారుకి సూచించారు.
ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న జగనన్న ఇళ్లపై చేసిన ఘాటు వ్యాఖ్యల్ని నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ” మీరు కొత్తగా నిర్మించే ఇళ్లు.. మీ పార్టీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పినట్టు శోభనం గదికే ఉపయోగపడకపోతే, ఆ తర్వాత పిల్లలు పుడతారుకదా.. మరి వాళ్లేమవుతారు.. నా సలహా ఏంటంటే.. కొత్తగా పెళ్లైన దంపతులందరికీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించేయండి అని నారాయణ కామెంట్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేకమైన వీడియో సందేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇలా ఉండగా, జగనన్న ఇళ్లపై హౌసింగ్ రివ్యూలో నిన్న నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ సరిగా లేవని అభిప్రాయపడ్డారు. బెడ్ రూమ్స్‌లో పెళ్ళయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కాస్త ఘాటు పదజాలాన్నే ఉపయోగించారు. బెడ్ రూమ్ చాలా చిన్నదిగా ఉందని.. లబ్ధిదారులు రాత్రివేళల్లో బెడ్ రూమ్ లో ఏదైనా పని చేయాలనుకున్నా ఇబ్బందిగా ఉంటుందంటూ కాస్త ‘ఏ’ గ్రేడ్ కామెంట్స్ పేల్చారు. బెడ్ రూమ్ లో పెద్ద మంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు.
బాత్ రూమ్ బయట ఏర్పాటుచేసి బెడ్రూమ్ సైజు పెంచాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మించనున్నారని.. అలాంటి ఇళ్లలో హాల్లో శోభనం చేసుకొని బెడ్రూమ్‌లో పడుకోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే డైలాగులు పేల్చారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.