President of India: ద్రౌపది ముర్ము‌కు కులాన్ని ఆపాదిస్తారా?.. సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

Presidential Elections: ద్రౌపది ముర్మును అడ్డంపెట్టుకుని గిరిజనులకు అన్యాయం చేయాలని కేంద్రం చూస్తోందని సీపీఐ నారాయణ (CPI Narayana) దుయ్యబట్టారు. అడవి హక్కుల చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు ద్రౌపది ముర్ము చొరవ చూపించాలని కోరారు.

President of India: ద్రౌపది ముర్ము‌కు కులాన్ని ఆపాదిస్తారా?.. సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
Cpi Narayana
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 22, 2022 | 12:19 PM

ద్రౌపది ముర్ము (Draupadi Murmu) తదుపరి దేశ రాష్ట్రపతిగా ఎన్నికకావడంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ (CPI Narayana) ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు కులాన్ని ఆపాదించడం సరికాదని అన్నారు. రాష్ట్రపతికి అయ్యేందుకు కావాల్సిన చాలా క్వాలిటీలు ఆమెకు ఉన్నాయని అన్నారు. గిరిజన మహిళ అంటూ ముర్ముకు కులాన్ని ఆపాదించడమంటే.. రాష్ట్రపతి అయ్యేందుకు ఆమెకున్న అర్హతలను తక్కువచేయడం అవుతుందన్నారు. గిరిజన మహిళ ముర్మును రాష్ట్రపతిని చేశామని బీజేపీ నేతలు ప్రగల్భాలు పలకడం సరికాదని అన్నారు. కొత్త చట్టంతో గిరిజనుల హక్కులను హరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గిరిజనుల హక్కులను కాలరాసే అలాంటి చట్టాన్ని ద్రౌపది ముర్ము ఆమోదిస్తారా? అంటూ ప్రశ్నించారు. ద్రౌపది ముర్మును అడ్డంపెట్టుకుని గిరిజనులకు అన్యాయం చేయాలని కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. అడవి హక్కుల చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు ద్రౌపది ముర్ము చొరవ చూపించాలని కోరారు.

అటు జీఎస్టీ ద్వారా రాష్ట్రాల స్వతంత్రాన్ని కేంద్రం హరిస్తోందని నారాయణ ధ్వజమెత్తారు. జీఎస్టీ విషయంలో రాష్ట్రాలకు అన్యాయయం జరుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా స్పష్టంచేశారని గుర్తుచేశారు. మహారాష్ట్రలో శివసేన సర్కారును కూల్చివేయడంలో బీజేపీ కక్షసాధింపు తెలుస్తోందన్నారు. ఆరోపణలు ఎదుర్కొనే వారు బీజేపీలో చేరితే మంచివారైపోతారా? అని ప్రశ్నించారు. కేంద్రం రాజకీయ బ్లాక్ మెయిల్ చేస్తోందని.. దీంతో రాష్ట్రాలు రాజకీయ భయంతో ఉన్నాయని అన్నారు.

వరద బాధితులకు వైఎస్సార్ ఇచ్చినంత ప్యాకేజీ కూడా సీఎం జగన్ ఇవ్వడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రం ఇచ్చిన ప్యాకేజీని కూడా ఇవ్వకపోవడం సరికాదన్నారు. పోలవరం ఎత్తు తగ్గితే విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మంత్రి పువ్వాడ అజయ్ అంటున్నారని.. ఎత్తు తగ్గిస్తే ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. అలాగే ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలనడం వితండవాదమన్నారు. ముంపునకు గురయ్యే గ్రామాలను రక్షించాలి తప్ప రెండు రాష్ట్రాలు వాదనలు చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..