ఒకేసారి నాలుగు దూడలకు పాలిచ్చిన గోమాత.. అందులో గోదె దూడలు సైతం..
కాకినాడ రమణయ్యపేటలో ఓ ఆవు తన దూడతో పాటు గేదె దూడలకు కూడా ఒకేసారి పాలు ఇస్తూ కనిపించింది. ఈ అరుదైన దృశ్యం స్థానికులు, పాదచారులు, వాహనదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆవు, గేదె దూడల మధ్య తేడా చూడకుండా పాలు ఇచ్చిన తీరుపై జంతు ప్రేమికులు స్పందించారు. ఈ ఘటనను మానవత్వం, సమానత్వానికి ప్రతీకగా అభివర్ణిస్తూ కుల, మత భేదాలపై చర్చించారు.

సాధారణంగా ఆవులు తమ దూడలకు మాత్రమే పాలు ఇస్తుంటాయి. కానీ కాకినాడ రమణయ్యపేటలో కనిపించిన ఓ దృశ్యం స్థానికులను, పాదచారులను, వాహనదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ఆవు తన దూడలతో పాటు మూడు గేదె దూడలకు కూడా ఒకేసారి పాలు ఇస్తూ కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, గోమాత మాతృప్రేమ గురించి చర్చించుకున్నారు.
ఆవు తన దూడలతో పాటు గేదె దూడలను కూడా ఎలాంటి తేడా లేకుండా దగ్గరకు తీసుకుని పాలు ఇవ్వడం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఆకలితో వచ్చిన నాలుగు దూడలకు ఒకే విధంగా పాలు అందించిన ఆవు తీరును చూసి జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఘటనను మానవత్వానికి ప్రతీకగా అభివర్ణిస్తూ పలువురు స్థానికులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జంతువులు కూడా ఆవు దూడ, గేదె దూడ అనే తేడా లేకుండా ప్రేమను పంచుకుంటున్నప్పుడు.. మనుషుల మధ్య కుల, మత, వర్గ భేదాలు ఎందుకు ఉండాలంటూ ప్రశ్నించారు.
“రక్తం అందరిదీ ఎరుపే.. ఆకలి అందరికీ ఒకటే.. కన్నీరు అందరికీ ఉప్పగానే ఉంటుంది. మరి మనిషి మనిషిని కులం పేరుతో ఎందుకు దూరం పెడుతున్నారు?” అంటూ కొందరు వ్యాఖ్యానించారు.
జంతువులు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత నుంచి మనుషులు మానవత్వం, సమానత్వం నేర్చుకోవాలని స్థానికులు, జంతు ప్రేమికులు పేర్కొన్నారు. కులం కాదు.. గుణం ముఖ్యం. విభజన కాదు.. సమానత్వమే సమాజానికి బలం అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
