
సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్సుయాత్ర 15 వ రోజుకి చేరుకుంది. శనివారం రాత్రి విజయవాడలో జరిగిన దాడి కారణంగా వైద్యుల సూచన మేరకు నిన్నంతా యాత్రకు విరామం ప్రకటించారు సీఎం జగన్. విరామం అనంతరం ఏప్రిల్ 15 సోమవారం నుంచి యాత్ర ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. దీంతో పాటు 15వ రోజు మేమంతా సిద్దం బస్సయాత్ర పూర్తి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. అటు కూటమి నేతలు పవన్, చంద్రబాబులు కూడా వరుసగా పర్యటనలు చేస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది.
విజయవాడ జీజీహెచ్ లో గాయానికి చికిత్స చేయించుకున్న జగన్ ఆదివారం కేసరపల్లికి చేరుకున్నారు. అక్కడే బస చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు కేసరపల్లి నైట్ స్టే చేసిన పాయింట్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్ద బస్సు యాత్రకు విరామం ఇవ్వనున్నారు. అక్కడే భోజనం చేసి కాసేపు విశ్రాంతి అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం జగన్. ఈ సభలో తనపై జరిగి దాడి గురించి సీఎం జగన్ ప్రస్తావిస్తారా లేదా.. ఏ అంశంపై ప్రసంగిస్తారన్న ఉత్కంఠ, ఆసక్తి చాలా మందిలో నెలకొంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఇది ప్రతిపక్షాల కుట్ర అని అభివర్ణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా దీనిని ఇలాగే చూస్తున్నారా లేక పోలీసుల దర్యాప్తుకే వదిలేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురంలో రాత్రికి బస చేసే శిబిరానికి చేరుకోనున్నారు సీఎం. రేపు గోదావరి జిల్లాల్లో మేమంతా సిద్దం బస్సుయాత్ర కొనసాగుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..