Azadi Ka Amrit Mahotsav: నేడే పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు.. జెండా ఆవిష్కరించి ప్రారంభించనున్న సీఎం జగన్
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య (Pingali Venkaiah) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పర్యాటక, క్రీడలు,...
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య (Pingali Venkaiah) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. వేడుకల్లో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పింగళి వెంకయ్య జీవితంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి (CM Jagan) ప్రారంభిస్తారు. కాగా.. చిత్తూరు జిల్లా నగరిలో జరిగే కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొననున్నారు. అయితే జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు సరైన నివాళి దక్కలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆగస్టు 2న ఆయన జయంతి సందర్భంగా స్వగ్రామం భట్లపెనుమర్రులో నివాళి అర్పించే ఏర్పాట్లు లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకపోవడంతో జెండాల కోసం కూడా గ్రామస్థులు స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది.
పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే మాధ్యమిక విద్యను మచిలీపట్నంలో పూర్తిచేసి సైనికుడిగా చేరారు. దక్షిణాఫ్రికాకు వెళ్లిన సమయంలో గాంధీజీని కలిశారు. ఆయన ప్రసంగాలకు ఆకర్షితుడై భారత్ కు తిరిగొచ్చారు. దేశానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపనతో మువ్వన్నెల జెండాను రూపొందించారు. విజయవాడలో జరిగిన సభల్లో స్వల్ప మార్పులతో ఆమోదం పొందారు. ఆ త్రివర్ణ పతాకమే కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తిని ప్రతిబింబించే గొప్ప చిహ్నంగా ఖ్యాతి గడించింది. మరోవైపు.. ఈ ఏడాది పింగళి వెంకయ్య జయంతిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
భట్లపెనుమర్రును సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామంలో నిర్వహించిన సభలో పింగళి వెంకయ్య మనవరాలు సుశీలను సత్కరించారు. ఆగస్టు 2న ఢిల్లీలో జరిగే వేలాది మందితో జరిగే పింగళి వెంకయ్య శత జయంతి సభకు రావాలని ఆయన మనవరాలిని, కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కేంద్ర మంత్రి ఆహ్వానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..