YS Jagan: ఆ ముగ్గురు నేతలను టార్గెట్ చేసిన సీఎం జగన్‌.. ‘నారీశక్తి’ వ్యూహంపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ..

| Edited By: Shaik Madar Saheb

Mar 22, 2024 | 11:17 AM

సీఎం జగన్‌.. ముగ్గురు నేతల్ని టార్గెట్ చేశారు. వారిని ఓడించడమే పనిగా పెట్టుకున్నారు. ఆ.. ముగ్గుర్ని చిత్తు చేసేందుకు ఏకంగా నారీ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఇంతకీ ఆ సెగ్మెంట్లలో పోటీ చేస్తోన్న నేతలెవరు? జగన్ వ్యూహాత్మక అడుగులతో వారికి చెక్‌ పడ్డట్టేనా?.. అనే విషయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి..

YS Jagan: ఆ ముగ్గురు నేతలను టార్గెట్ చేసిన సీఎం జగన్‌.. ‘నారీశక్తి’ వ్యూహంపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ..
Ys Jagan
Follow us on

సిద్ధం సభలతో వైసీపీలో ఎన్నడూలేనంత జోష్ కనిపిస్తోంది. అదే ఊపు, ఉత్సాహంతో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోంది. అధినేత, సీఎం జగన్ నిర్దేశించిన వైనాట్ 175 లక్ష్యానికి అనుగుణంగా లీడర్‌తో పాటు కేడర్‌ చకచకా సన్నద్ధమవుతోంది. అయితే, సీఎం జగన్ మాత్రం ఎన్నికల బరిలో ఆ ముగ్గురిపై గురి పెట్టారు. వారిని ఓడించి కూటమికి తిరుగులేని షాకివ్వాలని డిసైడ్ అయ్యారు.

సర్వేలు ఇచ్చిన బూస్టింగ్‌తో పోటీ

హిందూపురంలో బాలకృష్ణ.. మంగళగిరిలో లోకేష్‌.. పిఠాపురంలో పవన్‌.. ఈ ముగ్గురూ పక్కా వ్యూహాలు.. అంతకుమించి సర్వేలు ఇచ్చిన బూస్టింగ్‌తో ఆయా స్థానాల్లో పోటీలో నిలిచారు. సీఎం జగన్‌ సరిగ్గా ఈ స్థానాలనే టార్గెట్ చేశారు. ఇప్పటిదాకా ఎవ్వరూ ఊహించని తమ ప్రత్యర్థి నాయకులపై ఎవరూ అమలు చేయని సాహసోపేతమైన ప్రయత్నాన్ని అమలు చేయబోతున్నారు. పవన్, బాలకృష్ణ, లోకేష్‌లు పోటీ చేసే స్థానాల్లో మహిళల్ని బరిలో నిలిపారు. బాలకృష్ణపై దీపికను.. పవన్‌పై గీత.. లోకేష్‌పై లావణ్యను నిలబెట్టారు. దీంతో రాష్ట్ర రాజకీయం మొత్తం ఈ మూడు నియోజకవర్గాలపై ఆసక్తిగా గమనిస్తోంది.

హ్యాట్రిక్‌పై కన్నేసిన టీడీపీ

హిందూపురం.. టీడీపీ కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ మూడుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత పాముశెట్టి రంగ నాయకులు, నందమూరి హరికృష్ణ, సీసీ వెంకటరాముడు, అబ్దుల్ గని గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదూ రాష్ట్రం విడిపోయాక కూడా సూపర్ విక్టరీలతో తనకు తిరుగులేదని నిరూపించుకుంది టీడీపీ. 2014, 19 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌పై కన్నేసింది. అయితే ఈసారి టీడీపీ విజయం అంత ఈజీ కాదంటోన్న వైసీపీ.. బాలకృష్ణకు పోటీగా టీఎన్‌ దీపికను బరిలోకి దింపింది.

బోణీ కొట్టలేకపోయిన వైసీపీ

2014లో నవీన్ నిశ్చల్‌.. 2019లో మహ్మద్‌ ఇక్బాల్‌ను రంగంలోకి దింపినా వైసీపీ బోణీ కొట్టలేకపోయింది. కానీ ఈసారి దీపిక విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు జగన్ ఇమేజ్‌ కలిసొస్తుందని లెక్కలేసుకుంటోంది. మహిళా సెంటిమెంట్‌తో ఓట్లు కొల్లగొట్టేలా వ్యూహ రచన చేస్తోంది.

పోయిన చోటే వెతుక్కునే పనిలో లోకేష్‌

మరో ప్రతిష్టాత్మక నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో నారా లోకేష్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారిక్కడ. రాష్ట్ర రాజధానిగా అత్యంత కీలకమైన ప్రాంతమైన మంగళగిరిలో ఓటమిపాలు కావడం టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది. అయితే ఎక్కడ ఓటమి ఎదురైందో అక్కడే విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు లోకేష్‌. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారాయన. అటు వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థిని పోటీలోకి తీసుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె లావణ్యను రంగంలోకి దింపింది. బలమైన రాజకీయ నేపథ్యం, విద్యావంతురాలు, బీసీ సామాజికవర్గం నేత కావడం ఆమెకు ప్లస్‌ పాయింట్‌గా కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో విజయపతాక ఎగురవేయాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్‌… తెరవెనుక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

భీమవరం సీన్‌ని రిపీట్ చేయాలనుకుంటోన్న సీఎం జగన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తోన్న పిఠాపురంపైనా.. ముఖ్యమంత్రి జగన్ గురి పెట్టారు. 2019 ఎన్నికల్లో భీమవరం బరిలో నిలిచిన పవన్‌కు ఓటమి రుచి చూపిన జగన్‌ 2024లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. సీనియర్‌ నేత, విద్యావేత్త, సౌమ్యురాలైన వంగా గీతను పవన్‌కు పోటీగా నిలిపారు. జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వంగా గీతకు.. కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మంచి పట్టు ఉంది. ఆర్థికంగానూ సామాజికంగానూ తిరుగులేని గీత.. పవన్‌ను మట్టి కరిపించడం ఖాయమన్న అంచనాలు బలంగా ఉన్నాయి.

ప్రభుత్వంపై పవన్‌ పదే పదే విమర్శలు

టీడీపీ విషయంలో కాస్త ఆటు ఇటుగా ఆలోచించినా.. పవన్ మ్యాటర్‌కి వచ్చే సరికి చాలా సీరియస్‌గా ఉంటున్నారట జగన్. పదే పదే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేయడం.. లేనిపోని వివాదాలకు ఆజ్యం పోస్తుండటంతో పవన్‌ను ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చేశారట. అందుకే వంగా గీతకు సపోర్ట్‌గా మరో ఇద్దరు నేతల సమన్వయంతో ముందుకెళ్లేలా వ్యూహ రచన చేస్తున్నారు. భీమవరం ఫలితాన్నే పిఠాపురంలోనూ రిపీట్ చేయాలని బలంగా కోరుకుంటున్నారు.

నారా టీమ్‌పై నారీ శక్తిని ప్రయోగించబోతున్నారు సీఎం జగన్‌. మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఎవరి ఎత్తుగడ ఫలిస్తుందన్నది చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..