AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తళతళ మెరిసిపోనున్న రోడ్లు..!

ఏపీలో ప్రజలకు రోడ్ల సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రూ.1000 కోట్లతో కొత్త రోడ్లను నిర్మించనుంది. దీనికి సంబంధించి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాలి..? ఏవి కొత్తగా నిర్మించాలి..? అనేదానిపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తళతళ మెరిసిపోనున్న రోడ్లు..!
Ap Roads
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jul 24, 2025 | 10:01 PM

Share

రాష్ట్రంలోని 2వేల కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.1,000 కోట్లతో కొత్తగా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అంచనాలు, టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. మరో రూ.500 కోట్లతో రాష్ట్రంలో దెబ్బతిన్న మిగిలిన రహదారుల మరమ్మతులు వర్షాకాలంలోనూ కొనసాగించాలని.. వీలున్నంత త్వరగా వీటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రహదారుల నిర్మాణం, మరమ్మతులపై తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో అధ్వాన్నంగా తయారయ్యాయని ముఖ్యమంత్రి అన్నారు.

రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాలి..? ఏవి కొత్తగా నిర్మించాలి..? అనేదానిపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సంప్రదాయ విధానంలో రోడ్లు నిర్మించడం వల్ల ఆర్ధికంగా భారం కావడంతో పాటు, నాణ్యత విషయంలోనూ అనుకున్నంత స్థాయిలో లేవని.. అందుకే రహదారుల నిర్మాణంలో అత్యాధునిక విధానాలను అనుసరించాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 20,000 కి.మీ. మేర రహదారులను గుంతలు లేకుండా మరమ్మతులు పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర రహదారులు

‘‘జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారులు ఉండాలి. ప్రతీ రహదారి నిర్దేశిత ప్రమాణాలతో నిర్మించాలి. వర్షాకాలం ముగిసిన వెంటనే నవంబర్ నుంచి కొత్త రహదారుల నిర్మాణం చేపట్టాలి. ఏ రోడ్డు ఏ కాంట్రాక్టర్ నిర్మించారు. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు.. అనే వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలి. ప్రతీ 50 కి.మీ. చొప్పున అన్ని రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని అన్ని రహదారుల్లో మరమ్మత్తుల నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించి.. వర్షాకాలంలో రోడ్లు పాడవ్వకుండా కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు.

పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు

12,653 కి.మీ పొడవున రాష్ట్ర హైవేలు ఉండగా.. ఇందులో 20 కి.మీ. కన్నా పొడవైన రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. 20 కి.మీ. కన్నా పొడవైన రాష్ట్ర హైవేలు మొత్తం 260 వరకు ఉన్నాయి. అంటే 10,200 కి.మీ పొడవైన రాష్ట్ర హైవేలను పీపీపీ విధానంలో చేపట్టేందుకు వీలుంది. వీటిలో అత్యధిక రద్దీ ఉన్న 1,332 కి.మీ పొడవైన 18 రహదారులను ఫేజ్1 ఏ కింద.. 40 కి.మీ. కన్నా ఎక్కువ పొడవున్న 67 రహదారులు మొత్తం 3,854 కి.మీ రోడ్లను ఫేజ్ 1 బీ కింద.. అలాగే 20 నుంచి 40 కి.మీ. మధ్య ఉన్న 175 రహదారులు మొత్తం 5,039 కి.మీ. ఫేజ్ 2 కింద.. అదనంగా 115 కి.మీ పొడవున్న యలమంచిలి-గాజువాక, గాజులమండ్యం-శ్రీసిటీ(సెజ్) రోడ్లు కూడా పీపీపీ విధానంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై మరింత అధ్యయనం చేసి తుది నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..