Chirala Game Changer: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కొంపముంచిన పంతం..!

ఆంధ్రప్రదేశ్ అంతటా ఒక ఎత్తయితే చీరాలలో మరో ఎత్తు అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. మిగిలిన చోట్ల ముఖాముఖి పోటీలో టీడీపీ అభ్యర్థులు వైసీపీ మీద విజయం సాధిస్తే, చీరాలలో మాత్రం త్రిముఖ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ గేమ్‌ ఛేంజర్‌గా కాంగ్రెస్ అభ్యర్ధి వ్యవహరించారు. అదే టీడీపీకి ప్లస్ అయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఎంటా ఈక్వేషన్‌..?

Chirala Game Changer: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కొంపముంచిన పంతం..!
Chirala Politics

Updated on: Jun 06, 2024 | 7:02 PM

ఆంధ్రప్రదేశ్ అంతటా ఒక ఎత్తయితే చీరాలలో మరో ఎత్తు అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. మిగిలిన చోట్ల ముఖాముఖి పోటీలో టీడీపీ అభ్యర్థులు వైసీపీ మీద విజయం సాధిస్తే, చీరాలలో మాత్రం త్రిముఖ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ గేమ్‌ ఛేంజర్‌గా కాంగ్రెస్ అభ్యర్ధి వ్యవహరించారు. అదే టీడీపీకి ప్లస్ అయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఎంటా ఈక్వేషన్‌..?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు వార్‌ వన్‌ సైడ్‌గా ఎన్నికల ఫలితాలు వస్తే, చీరాలలో మాత్రం ఇందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య ముఖాముఖి పోటీ నడిస్తే, చీరాలలో మాత్రం త్రిముఖ పోటీ జరిగింది. అదే టీడీపీకి ప్లస్ అయిందని భావిస్తున్నారు. లేకుంటే ఇక్కడ వైసీపీ విజయం సాధించేదంటున్నారు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్. ఇక్కడ వైసీపీ విజయావకాశాలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ దెబ్బతీశారని విశ్లేషిస్తున్నారు. ఇక్కడ గెలవడం ముఖ్యం కాదు, ఓడించడమే ప్రధానం అన్నట్టుగా ఆమంచి రాజకీయాలు సాగాయట.
నేను ఓడినా ఫర్వాలేదు, శత్రువు గెలవకూడదు అన్నట్టుగా చీరాలలో రాజకీయం రసవత్తరంగా నడిచిందట.

చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు రికార్డు స్థాయిలో 41,859 ఓట్లు లభించాయి. ఇది రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లలో అత్యధికం కావడంతో రాజకీయ విశ్లేషకుల్లో విస్తృత చర్చ నడుస్తోంది. చీరాలలో ఆమంచి పరిస్థితి అయిపోయిందని భావించిన వారికి ఈ ఫలితాలు ఆశ్చర్యాన్ని, చీరాలపై ఆమంచి పట్టును మరోసారి బహిర్గతం చేసినట్టయింది. దీంతో చీరాల రాజకీయాల్లో ఆమంచి గేమ్‌ ఛేంజర్‌గా మారిపోయారట.

ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి సునామీని, మరోవైపు అధికారపార్టీ అంగబలాల మధ్య కాంగ్రెస్ పార్టీ దాదాపు శూన్యమని భావించిన తరుణంలో ఒక్క చీరాలలోనే కాంగ్రెస్‌ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్‌కు ఇన్ని వేల ఓట్లు వచ్చాయంటే అది కేవలం ఆమంచి వ్యక్తిగతంగా సంపాదించినవేనని భావిస్తున్నారు. గతంలో చీరాల నియోజకవర్గంలో ఆమంచిపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చినా జనంపై ఆయన పట్టును కోల్పోలేదనడానికి ఇదే నిదర్శనమంటున్నారు.

చీరాలలో టీడీపీ నుంచి ఎంఎం కొండయ్య యాదవ్, వైసీపీ నుండి కరణం వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్‌లు పోటీ చేశారు. చీరాల వైసీపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీకి దిగినా ఆయన ప్రభావం పెద్దగా ఉండదని, ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆమంచి 42 వేల ఓట్లను సంపాదించడంతో అవన్నీ వైసీపీకి చెందిన ఓట్లేనని అంచనా వేస్తున్నారు. ఆమంచి గనుక పోటీలో లేకుంటే ఇక్కడ ఫలితం వేరే విధంగా ఉండేదని, వైసీపీ అభ్యర్ధి కరణం వెంకటేష్‌ ఇక్కడ భారీ విజయం సాధించేవారని విశ్లేషిస్తున్నారు. టీడీపీ అభ్యర్ధి ఎంఎం కొండయ్య పరాజయం పాలయ్యేవారన్న చర్చ నడుస్తోంది.

ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్ది ఎంఎం కొండయ్య యాదవ్‌కు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 72, 700 పోలయ్యాయి. వైసీపీ అభ్యర్ధి కరణం వెంకటేష్ కు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 51,716 పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్‌కు 41,295 ఓట్లు పోలయ్యాయి. ఆమంచి కనుక పోటీలో లేకుంటే వైసీపీ అభ్యర్దికి ఆమంచి ఓట్లతో కలుపుకుని 93 వేల ఓట్లు వచ్చి ఉండేవి. దీంతో ఇక్కడ వైసీపీ అభ్యర్ధి కరణం వెంకటేష్‌ 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది ఉండేవారు. ఆమంచి ఒక్కరే 42 వేల ఓట్లు చీల్చడంతో వైసీపీ అభ్యర్ధి కరణం వెంకటేష్‌ ఓట్లకు భారీగా గండి పడింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్ధి ఎంఎం కొండయ్యకు ఆమేర 20 వేల ఓట్ల మెజారిటీ ట్రాన్స్‌ఫర్‌ అయిందంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఆమంచి కనుక పోటీలో లేకుంటే ఇక్కడ టీడీపీకి గెలుపు కష్టం అయ్యేదని భావిస్తున్నారు.

ఏదిఏమైనా ఎపీ అంతటా వార్‌ ఒక విధంగా నడిస్తే, చీరాలలో మాత్రం త్రిముఖ పోటీతో టీడీపీకి లాభించిందని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. నేను ఓడినా ఫర్వాలేదు, శత్రువు విజయం సాధించకూడదన్న పట్టుదలతో గేమ్‌ను ఛేంజ్‌ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ది ఆమంచి కృష్ణమోహన్‌ ఉన్నారట. వచ్చిన ఫలితం కూడా అదే విషయాన్ని నిరూపిస్తుండటంతో విజయం ఇంటి ముగింటదాకా వచ్చి వెనుతిరిగిందన్న నిరాశలో వైసీపీ అభ్యర్ది కరణం వెంకటేష్‌ ఉంటే, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న సంతోషంలో విజయం వరించిన టీడీపీ అభ్యర్ధి ఎంఎం కొండయ్య సంతోషంగా ఉన్నారట. కాలం కలిసిరావడం అంటే ఇదేనేమో..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..