AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో హై అలర్ట్.. టీడీపీ బంద్‌కు జనసేన, ఎమ్మార్పీఎస్ మద్దతు.. భారీ బందోబస్తు..

Chandrababu Naidu arrest: క్షణం క్షణం ఉత్కంఠ.. నంద్యాల టూ రాజమండ్రి సెంట్రల్‌ జైలు. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన హడావుడి ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Andhra Pradesh: ఏపీలో హై అలర్ట్.. టీడీపీ బంద్‌కు జనసేన, ఎమ్మార్పీఎస్ మద్దతు.. భారీ బందోబస్తు..
TDP Andhra Pradesh Bandh
Shaik Madar Saheb
|

Updated on: Sep 11, 2023 | 8:09 AM

Share

Chandrababu Naidu arrest: క్షణం క్షణం ఉత్కంఠ.. నంద్యాల టూ రాజమండ్రి సెంట్రల్‌ జైలు. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన హడావుడి ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ కు ముందు.. ఏసీబీ కోర్టు వాడీవేడి వాదనలు కొనసాగాయి. చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా.. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ చంద్రబాబును కాన్వాయ్ ద్వారా రాజమండ్రికి తరలించారు.

కాగా.. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్‌నకు పిలుపునిచ్చింది. టీడీపీ బంద్‌కు జనసేన, ఎంఆర్పీఎస్ మద్దతు తెలిపాయి. శాంతియుత నిరసనలు చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. చంద్రబాబు అరెస్టు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా రాజమండ్రి అంతటా సెక్షన్‌ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జైలు దగ్గర వందలాది మంది పోలీసులను మోహరించారు.

సెక్షన్ 144 దృష్ట్యా ఆందోళనలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే.. నగరాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. వ్యాపార సముదాయాలను, బస్సులను ఆపడం, జన జీవనానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. కాగా.. ఉదయం నుంచి నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

బెయిల్ కోసం న్యాయవాదుల ప్రయత్నం

ఇదిలాఉంటే.. చంద్రబాబు బెయిల్ కోసం న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, సీఐడీ వేసిన పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబును జైలుకు బదులు గృహనిర్బంధంలో ఉంచాలని పిటిషన్‌ దాఖలు చేయగా.. జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ పిటిషన్‌ వేసింది. ఈ పిటీషన్లపై ఇవాళ కీలక విచారణ జరగనుంది.

మద్దతు తెలపలేదు.. బీజేపీ

కాగా.. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ కు మద్దతు ఇచ్చినట్లుగా మొదట ప్రచారం జరిగింది. బిజెపి లెటర్ హెడ్ పై పురంధేశ్వరి పేరుతో బంద్ కు మద్దతు ఇచ్చినట్లు లెటర్ సర్క్యూలేట్ అయింది. ఇది ఫేక్ అని బీజేపీ ప్రకటించింది. ఒక ఫేక్ లెటర్ వాట్సప్ గ్రూప్ లలో సర్క్యులేట్ అవుతోందని.. దీని కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..