TDP Candidates: గతానికంటే భిన్నంగా అభ్యర్ధుల ఎంపిక.. తీవ్ర కసరత్తు చేస్తున్న అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఇంచార్జిలు లేకపోవడంతో కేడర్ ఉన్నా పార్టీని ముందుకు నడిపించే నాయకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్ధులు రేసులో ఉండటం కూడా తలనొప్పిగా మారింది. దీంతో ఆయా స్థానాలపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక అభ్యఃర్ధుల ప్రకటన కూడా ఇప్పట్లో లేదని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పవర్‌లోకి రావాలనేది టార్గెట్‌గా పెట్టుకుని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా జనసేనతో అత్యంత పకడ్బందీగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తోంది. నియోజకవర్గంలో రెండు పార్టీలు కలిసి ప్రభుత్వంపై ఆందోళనలు చేయడంతో పాటు టిక్కెట్ల విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇరు పార్టీల అధినేతలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే అంతర్గతంగా ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపుతో పాటు ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై కూడా క్లారిటీ కూడా వచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటికే చంద్రబాబు – పవన్ కళ్యాణ్ అనేకమార్లు భేటీ అయ్యారు. ఇరు పార్టీలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్సార్ సీపీ సీట్ల కేటాయింపు విషయంలో దూకుడుగా వెళ్తుండటం, కీలక స్థానాల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధులను ఓడించేందుకు బీసీ సామాజిక వర్గాల నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ ఉండటంతో అభ్యర్ధుల ఎంపిక విషయంలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఇంచార్జిలు లేకపోవడంతో కేడర్ ఉన్నా పార్టీని ముందుకు నడిపించే నాయకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్ధులు రేసులో ఉండటం కూడా తలనొప్పిగా మారింది. దీంతో ఆయా స్థానాలపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక అభ్యఃర్ధుల ప్రకటన కూడా ఇప్పట్లో లేదని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ అభ్యర్ధల ప్రకటన ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెప్పుకొస్తున్నారు.
అభ్యర్ధుల ఎంపికపై గతానికంటే భిన్నంగా చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సీటు ఆశిస్తున్న అభ్యర్ధులతో ఎప్పటి నుంచో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా పార్టీ తరపున చేయించిన సర్వేల నివేదకలను వారి ముందు ఉంచుతున్నారు. స్థానిక అంశాలు, ప్రజల్లో సానుకూలత ఎవరికి ఉన్నదనే అంశాల ప్రకారం ఇంచార్జిలను నియమిస్తున్నారు. ఇప్పటివరకూ కొన్ని కీలక నియోజకవర్గాలకు ఇంచార్జిల నియామకం పూర్తి చేశారు చంద్రబాబు. ఇక లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతున్న సమయంలో మరికొన్ని స్థానాలకు ఇంచార్జిలను ప్రకటించారు. ఇలా ఒక్కొక్కటిగా నియోజకవర్గాల వారీగా ఇంచార్జిల విసయంలో నిర్ణయం తీసుకుంటున్నారు.
అయితే మెజారిటీ స్థానాల్లో గతానికంటే భిన్నంగా ఇంచార్జిల ఎంపికలో ముందుకెళ్తున్నారు చంద్రబాబు. పార్టీ తరపున చేస్తున్న సర్వే నివేదికలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్నారు. నాయకులు, ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక నియోజకవర్గంలో ఇద్దరు లేదా ముగ్గురు పేర్లను చెప్పడం.. ఐవీఆర్ ఎస్ ద్వారా వారిపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు.ః ఇదంతా చంద్రబాబు స్వయంగా దగ్గరుండి తీసుకుంటున్నారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్టీ ఎంత బలంగా ఉన్నప్పటికీ సరైన అభ్యర్ధిని బరిలోకి దించకుంటే ఓటమి తప్పదనే అభిప్రాయంతో ఉన్నారట టీడీపీ అధినేత.
గతంలో సర్వేలతో పాటు పార్టీలోని సీనియర్ నేతలు, ఆయా జిల్లాల నేతల అభిప్రాయాలు తీసుకుని టిక్కెట్లు ఖరారు చేసేవారు. కానీ ఈసారి ఎన్నికలకు మాత్రం భిన్నంగా వెళ్తున్నారు. మరోవైపు అభ్యర్ధుల ప్రటన ముందుగానే చేయాలని అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ నిర్ణయం మార్చుకున్నారట చంద్రబాబు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అభ్యర్ధుల ప్రకటన ద్వారా ఎక్కడైనా అసంతృప్తులు ఉన్నప్పటికీ పార్టీకి పెద్దగా ఇబ్బంది రాదనే భావనలో ఉన్నారని తెలిసింది. అయితే, ఇదే సమయంలో అప్పటికప్పుడు అభ్యర్ధుల ప్రకటన ద్వారా ప్రజల్లోకి వెళ్లడానికి సమయం కూడా తక్కువ ఉంటుందనే వాదన కూడా వినిపిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…