విశాఖ వేదికగా రుషికొండలో ఏపీ ప్రభుత్వం పరిపాలనా భవనాలను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. అయితే వీటిని పర్యావరణానికి హానికలిగిస్తూ నిర్మించారని పలు రాజకీయ పార్టీల నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్దంగా నిర్మించారంటూ ప్రతిపక్షాలు తమ గళాన్ని వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ తెరదించేందుకు నేడు రుషికొండకు కేంద్ర బృందం పర్యటించనుంది. పర్యావరణ నిబంధనలను ఏమేరకు పాటించారు. ఎక్కడ ఉల్లంఘించారో పరిశీలించేందుకు సిద్దమైంది. నిర్మాణాల్లోనే కాకుండా తవ్వకాల్లో ఎంత వరకూ నిబంధనలు పాటించారో తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు.
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పలు చోట్ల అక్రమాలు జరిగాయని వస్తున్ ఆరోపణల నేపథ్యంలో వాటిని కూడా పరిశీలించనున్నారు. రుషికొండ తవ్వకాలతో పాటూ కట్టడాలపై ఇప్పటికే ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు వేశారు. గతంలో నష్టాన్ని అంచనావేసి తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే గత విచారణ సమయంలో రుషికొండ నిర్మాణాల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు ఏపీటీడీసీ ఒప్పుకుంది. హైకోర్టు అదేశాలతో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.
ఇదిలా ఉంటే ఇప్పటికే పరిపాలనా భవనాలను నిర్మించి త్వరలో విశాఖ నుంచి పాలనను కొనసాగించాలని చూస్తొంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఉన్నతాధికారులు, మంత్రులు కూడా అక్కడే నివాసం ఉండేందుకు భవనాలను చూడాలని గతంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం పర్యావరణ అధికారుల పరిశీలనతో కొత్తగా నిర్మించిన భవనాల్లో నుంచి పరిపాలన కొనసాగుతుందా లేక వాయిదా పడుతుందా అనేది వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..