ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇవాళ తుది తీర్పు.. 13 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది సీబీఐ కోర్టు. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. 2007 జూన్ 18న అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం దగ్గర..

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది సీబీఐ కోర్టు. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. 2007 జూన్ 18న అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం దగ్గర 95 హెక్టార్లలో గాలి జనార్ధన్‌రెడ్డి కంపెనీకి ఇనుప ఖనిజం గనుల లీజులు కట్టబెట్టింది అప్పటి వైఎస్ ప్రభుత్వం. అయితే, ఇనుక ఖనిజం తవ్వకాలు, రవాణా-అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో 2009 డిసెంబర్ 7న కేసు నమోదు చేసింది సీబీఐ. ఓఎంసీ యజమానులైన గాలి జనార్ధన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు అప్పటి గనులశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డితో పాటు అధికారులైన కృపానందం, శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్, లింగారెడ్డిపై అభియోగాలు నమోదు చేసింది.
ఓఎంసీ ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట ఫైల్ రూపొందించి.. తర్వాత ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ అనే పదం తొలగించి జీవో ఇచ్చినట్టు ప్రధాన అభియోగం. అలాగే కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరిపారని,. ఏపీ-కర్నాటక సరిహద్దు రాళ్లను మార్చడం.. సుగులమ్మ ఆలయాన్ని కూల్చడం.. అటవీ భూముల ఆక్రమణ.. అక్రమంగా ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించారని అభియోగాలు మోపింది. మే నెలలోగా విచారణ పూర్తిచేయాలన్న సుప్రీం ఆదేశాలతో.. వాదనలు ముగించి.. ఇవాళ తుది తీర్పు ఇవ్వడానికి సిద్ధమైన సీబీఐ కోర్టు.
