Krishna river: రోడ్డు మార్గం గుండా అయితే 150 కిలోమీటర్లు.. అదే నది గుండా అయితే 2కిమీ.. అందుకే
ఆహారం కోసం వలస వెళ్లే పక్షులు, చేపలు గురించి అందరికీ తెలుసు. కానీ తాజాగా కృష్ణా నదిలో గోవుల వలస అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక కాపరి, కృష్ణా నదికి పూజలు చేసి వందకు పైగా గోవులను నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లోకి దించాడు. అవన్నీ నదిని ఈదుకుంటూ ఆంధ్రప్రదేశ్ వైపు చేరాయి.

ఆహారం కోసం, గుడ్లు పెట్టడం, పిల్లలకు జన్మనినవ్వడం కోసం వివిధ రకాల జీవులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లటం అందరికీ తెలిసిందే. ఇందుకోసం విపత్కర పరిస్థితుల్లో సైతం చాలా దూరం జంతువులు ప్రయాణిస్తుంటాయి. పక్షులైతే ఏకంగా ఒక ఖండం నుండి మరొక ఖండానికి ట్రావెల్ చేస్తాయి. పులస వంటి చేపలు సముద్రంలో ఎదురీదుతూ వచ్చి గోదావరిలో గుడ్లు పెడతాయి. తాజాగా అలానే మంచి మేత కోసం గోవుల ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
కృష్టానదికి ఇరువైపులా నల్లమల ప్రాంతం విస్తరించింది. ఇటువైపు ఏపి.. అటు వైపు తెలంగాణ రాష్ట్రాలున్నాయి. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల నుండి ఏపిలోని పల్నాడు, కర్నూలు జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతాల్లోకి గోవులు ఆహారం కోసం వస్తుంటాయి. పశువుల కాపరులు ఇటువైపు నుంచి అటు వైపుకు…. అటు నుంచి ఇటు వైపుకు తమ పశువులను తోలుకుంటూ వస్తారు. అయితే సాధారణంగా మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి కర్నూలు వైపు ఉన్న నల్లమల ప్రాంతాలకు రావాలంటే 150 కిలోమీటర్లపైగానే ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇది అత్యంత ప్రయాసతో కూడిన ప్రయాణం. అయితే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లొ నుంచి.. ఈదితే కేవలం రెండు కిలోమీటర్ల దూరంతోనే అటు ఇటు ప్రయాణించవచ్చు. ఈ నేపద్యంలోనే గోవుల కాపర్లు నాగర్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో తమ గోవులను అటూ, ఇటూ తీసుకెళ్తుంటారు.
మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి ఒక కాపరి కృష్ణా నదికి పూజ చేసి తమ గోవులను నదిలోకి దించుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వంద వరకూ ఉన్న గోవులు రైతు పూజ చేసిన తర్వాత కృష్ణా నదిలోకి దిగి ఈదుకుంటూ ఈ వైపు నుంచి ఆ వైపుకు ఈదడం మొదలెట్టాయి. సాధారణంగా ఆహారం కోసం ఇటువంటి ప్రయాణాలు చేస్తుంటామని పశువుల కాపర్లు చెబుతున్నారు. బ్యాక్ వాటర్‌లో ఇలా ఈదుకుంటూ వెళ్లడం పశువులకు అలవాటేనని వెల్లడిస్తున్నారు.
