Sudha Chandran: గ్లామర్ ప్రపంచంలో ఉన్నా నానమ్మ చిట్కాలే సుధా చంద్రన్ బ్యూటీ సీక్రెట్!
నేటి కాలంలో అందం కోసం మార్కెట్లో దొరికే రకరకాల సీరమ్స్, షీట్ మాస్క్‌లు, విదేశీ బ్యూటీ ట్రెండ్స్ వెంట పడటం చూస్తున్నాం. కానీ, ఎంతటి గ్లామర్ ప్రపంచంలో ఉన్నా సరే.. తన మూలాలను మర్చిపోకుండా, అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి 'దేశీ నుస్కా'లనే నమ్ముకుంటోంది ఒకప్పటి స్టార్ నటి.

ఆమెకు ఆయుర్వేదం అనేది ఒక ఫ్యాషన్ కాదు, అది ఒక జీవన విధానం. చిన్నప్పటి నుండి తన ఇంట్లో చూసిన ఆచారాలనే నేటికీ పాటిస్తూ, తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ఆ నటి ఫాలో అవుతున్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..
ఆమె ఒక గొప్ప నటి మాత్రమే కాదు, అద్భుతమైన నృత్యకారిణి కూడా. వెండితెరపై ఆమె కళ్లు మాట్లాడతాయని, ఆమె హావభావాలు ఎంతో స్పష్టంగా ఉంటాయని అందరూ అంటుంటారు. అయితే, తన కళ్ల చుట్టూ ఉండే ఆ మెరుపుకు, తన ఒత్తుగా ఉండే జుట్టుకు కారణం కేరళ ఆయుర్వేదమేనని ఆమె గర్వంగా చెబుతోంది. ఇప్పటికీ మేకప్ తీయడానికి కొబ్బరి నూనెనే వాడుతూ, సొంతంగా ఇంట్లో తయారు చేసిన కాటుకనే నమ్ముకునే ఆ సీనియర్ స్టార్ మరెవరో కాదు.. సుధా చంద్రన్.
చిన్ననాటి ఆచారాలే..
సౌత్ ఇండియన్ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన సుధా చంద్రన్, చిన్నప్పటి నుండి తన నానమ్మ పాటించిన నియమాలనే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం నాడు కచ్చితంగా తలకు, ఒంటికి కొబ్బరి నూనె పట్టించి స్నానం చేయడం అనేది వారి ఇంట్లో ఒక పవిత్రమైన ఆచారమని ఆమె గుర్తు చేసుకున్నారు. స్కూల్ కి వెళ్లాలన్నా సరే.. నూనె పెట్టకుండా బయటకు పంపించేవారు కాదట. ఆ క్రమశిక్షణే ఇప్పుడు తన జుట్టును ఆరోగ్యంగా ఉంచిందని ఆమె నమ్ముతున్నారు.
ఆయుర్వేదానికి కేరళ పుట్టినిల్లు అని చెప్పే సుధా చంద్రన్, తన రోజువారీ జీవితంలో ఆయుర్వేద కషాయాలకు పెద్ద పీట వేస్తారు. జలుబు చేసినప్పుడు ‘దశమూలారిష్టం’ వంటి టానిక్కులను క్రమం తప్పకుండా తీసుకుంటారు. అంతేకాకుండా, బాడీ క్లెన్సింగ్ కోసం ఆముదాన్ని వాడటం ఆమెకు అలవాటు. ప్రతి 15 రోజులకోసారి శనివారం నాడు పొట్టను శుభ్రం చేసుకోవడం అనేది తన చిన్నప్పటి నుండి అమ్మ నేర్పిన ఒక మంచి అలవాటని ఆమె పేర్కొన్నారు.
ప్రజలు తన కళ్లు చాలా ఎక్స్‌ప్రెసివ్ గా ఉంటాయని పొగిడినప్పుడు, ఆమె తన నానమ్మ చేసిన కాటుకనే గుర్తు చేసుకుంటారు. దీపం మసిని సహజ సిద్ధమైన నూనెలతో కలిపి తయారు చేసిన ఆ కాటుకనే ఆమె ఇప్పటికీ వాడుతున్నారు. రాత్రి పడుకునే ముందు కనురెప్పల ఎదుగుదల కోసం ఆముదం రాసుకోవడం ఆమె దినచర్యలో భాగం. మేకప్ తొలగించడానికి వెట్ టిష్యూలు లేదా ఫ్యాన్సీ మేకప్ రిమూవర్ల జోలికి వెళ్లకుండా, కేరళ నుండి తెప్పించిన స్వచ్ఛమైన కొబ్బరి నూనెనే ఆమె ఉపయోగిస్తారు.
ఆయుర్వేద మసాజ్‌లు..
ముంబైలో స్థిరపడినా, కేరళకు చెందిన నిపుణుల ద్వారా ‘పొట్లి మసాజ్’ చేయించుకోవడం ఆమెకు ఇష్టం. స్వీడిష్ లేదా ఫ్రెంచ్ మసాజ్‌ల గురించి తనకు తెలియదని, తన పూర్వీకులు ఏం చేశారో అదే తాను అనుసరిస్తానని ఆమె స్పష్టం చేశారు. “నా తల్లిదండ్రులకు మేలు చేసిన పద్ధతులు నాకు కూడా మేలు చేస్తాయని నేను నమ్ముతాను. జీవితం చాలా సులభం, దానిని అనవసరంగా సంక్లిష్టం చేసుకోవద్దు” అని ఆమె సందేశం ఇచ్చారు. సుధా చంద్రన్ చెప్పిన విషయాలను బట్టి చూస్తే.. సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతికి దగ్గరగా ఉండటమే నిజమైన అందం అని అర్థమవుతోంది. నానమ్మలు చెప్పిన చిట్కాల్లో దాగి ఉన్న సైన్స్ ను మనం గుర్తించి పాటిస్తే, కృత్రిమ వస్తువుల అవసరమే ఉండదు.
