Andhra: మీ ప్రాంతాల్లో గుంతల రోడ్లతో విసిగిపోతున్నారా..? సర్కారువారి శుభవార్త ఇదే
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మొత్తం 274 రహదారుల పునరుద్ధరణ కోసం రూ.1000 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను వేగంగా పునరుద్ధరించి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆంధ్రాలో రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించేందుకు రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 274 రహదారుల మరమ్మతు పనులు ఈ కేటాయింపులో భాగంగా చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టీ. కృష్ణబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్ల స్థితి, వర్షాల ప్రభావం, ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇందులో భాగంగా.. స్టేట్ హైవేల్లో 108 రహదారి పనులకు రూ.400 కోట్లు, జిల్లా రహదారుల్లో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు పాత రహదారుల పునరుద్ధరణతో పాటు డ్రైనేజీ సదుపాయాల మెరుగుదల, కొత్త సిమెంట్ రోడ్లు, బైపాస్ మార్గాలను ఆధునీకరించడం వంటి అంశాలు కూడా ప్రాధాన్యంగా తీసుకుంటామని రహదారులు, భవనాల శాఖ అధికారులు తెలిపారు.
ఇటీవలి వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రహదారులు దెబ్బతినడం, గుంతలు పడటం, రవాణా సమస్యలు తీవ్రంగా ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పలు మార్గాల్లో రహదారుల దుస్థితి పెరిగింది. ప్రభుత్వం ఈ నిధుల కేటాయింపుతో రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, సంబంధిత శాఖలు టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
