Andhra: గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ జిల్లాలోని ఆ ఫారెస్ట్‌లో అందుబాటులోకి జంగిల్ సఫారీ, జిప్ లైనర్
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోని అందమైన నెమళ్లు, ఉరకలువేసే జింకపిల్లలు, పులులు, పచ్చని చెట్లు, పక్షులు.. ప్రకృతి, జంతుప్రేమికులకు కనువిందుగా మారనున్నాయి. వర్షాకాలంలో చెరువులు, జలపాతాలు, పచ్చని అడవి దృశ్యాలు మరింత ఆహ్లాదాన్ని ఇస్తాయి. మూలపాడు సీతాకోకచిలుకల పార్క్‌లో జంగిల్ సఫారీ, జిప్‌లైన్, జంగిల్ క్యాంప్ వంటి సౌకర్యాలు పర్యాటకులను ఆకర్షించడానికి ఏర్పాటు చేస్తున్నారు.

కొండపల్లి ఫారెస్ట్‌లోని అందమైన నెమళ్లు, ఉరకలువేసే జింకపిల్లలు, పులులు సహా మరెన్నో జంతువులు ప్రకృతి, జంతు ప్రేమికులకు కనువిందుగా మారతాయి. అడవిలో ప్రయాణించడం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి అనుభూతిని పొందాలని ఎవరికి ఉండదు చెప్పండి..?
వర్షాకాలంలో వన సందర్శనకు వెళ్తే, చిటపట చినుకులు కురుస్తూ, పచ్చని చెట్లు మధ్యన పక్షులు కిలకిలరావలు చేస్తూ, మనసును మాయ చేసేవి. రణగొణ ధ్వనులకు దూరంగా పచ్చని అడవిలో అదో అద్భుత లోకంలా ఉంటుంది. అలాంటి అడవిలోకి అడుగుపెట్టడానికి ఆలస్యం ఎందుకు? కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ మీకు స్వాగతం పలుకుతుంది.
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు సీతాకోకచిలుకల పార్క్‌లో మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టెక్కింగ్‌తో పాటు ప్రకృతిని ఆస్వాదించడానికి అనుకూలమైన పరిస్థితులు కూడా కల్పించనున్నారు. అటవీ పర్యాటకులకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఎక్కువ మందిని ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. విజయవాడ నగరానికి, అమరావతికి అతి దగ్గరగా ఉండడం వల్ల దీని అభివృద్ధి కీలకంగా మారింది. విజయవాడ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, అమరావతి నుంచి కూడా ఎక్కువ మంది సందర్శకులు చేరే అవకాశం ఉంది. భవిష్యత్తులో మూలపాడుతో అమరావతి మధ్య ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం కాబట్టి, దీనికి మరింత ప్రాధాన్యత సంతరించబడుతుంది.
అందమైన, దట్టమైన అటవీ ప్రాంతంలో పర్యాటకులు తిరిగేలా జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రత్యేక వాహనంలో అడవిలో విహరించవచ్చు. ఒక్కో వాహనంలో 13 మంది ప్రయాణించే వీలుంది. సీతాకోకచిలుకల పార్క్ నుంచి లోపల ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వరకు పర్యటించవచ్చు. అక్కడి నుంచి 700 మీటర్ల దూరంలో కనువిందు చేసే జలపాతం ఉంది. అక్కడికి నడిచే మార్గం కూడా ఉంది. ప్రస్తుతానికి ప్రత్యేక వాహనం ఒక్కటే అందుబాటులో ఉంది. పర్యాటకుల రద్దీ ఆధారంగా జంగిల్ సఫారీ ప్రారంభించబడుతుంది.
తదుపరి దశలో, అడవిలో ఆటల కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, దీపావళి నాటికి రెండు కొండల మధ్య జిప్ లైనర్ ఏర్పాటు చేయనున్నారు. దీని పొడవు 400 మీటర్లకు పైగా ఉంటుంది. కొండపైకి ఎక్కిన తర్వాత, జిప్ లైనర్ ద్వారా అవతలి ప్రదేశానికి చేరుకోవచ్చు. మరోవైపు, నల్లమల విహారానికి విచ్చేసే పర్యాటకులు జంగిల్ క్యాంప్ విహారాలను ఆన్‌లైన్‌లోnstr.co.in ద్వారా తెలుసుకోవచ్చు.
