Baptist Ghat in Mangalagiri: ఏపీలోని మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మాణం 3 వారాలుగా ఉద్రిక్తతలకు దారి తీస్తూనే ఉంది. ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో ఎలా ఘాట్ నిర్మిస్తారంటూ స్థానిక బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు. బాప్టిజం ఘాట్ నిర్మాణంతో ఇక్కడ మతమార్పిడులు పెరుగుతాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ బాప్టిస్ట్ ఘాట్ నిర్మాణానికి వ్యతిరేకిస్తూ MTMC కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. నిర్మాణాలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే ఆర్కే అనుమతితోనే తాము ఘాట్ నిర్మాణ పనులు చేపట్టామని మంగళగిరి క్రైస్తవ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు పేర్కొంటున్నారు. భూమి చదును చేసి పిల్లర్స్ వేసి నిర్మిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని.. అనుమతి ఉందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో మంగళగిరిలో బాప్టిస్ట్ ఘాట్ నిర్మాణంపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. మతమార్పిడులకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందంటూ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు మంగళగిరిలో బాప్టిస్ట్ ఘాట్ పనుల్ని అడ్డుకున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘‘హిందూ దేవాలయాల భూములు, కానుకలు ఇష్టానుసారం ఖర్చు చేస్తూ హైందవ సంస్కృతి బలోపేతానికి అర కొర నిధులతో చేతులు దులుపుకునే ఈ ప్రభుత్వం, నేరుగా మతమార్పిడికి వీలుగా బాప్తీస్మం ఘాట్ల నిర్మాణం చేపట్టడం దేనికి సంకేతం?’’ అంటూ వీర్రాజు ట్వీట్ చేశారు.
హిందూ దేవాలయాల భూములు,కానుకలు ఇష్టానుసారం ఖర్చు చేస్తూ హైందవ సంస్కృతి బలోపేతానికి అర కొర నిధులతో చేతులు దులుపుకునే ఈ ప్రభుత్వం , నేరుగా మతమార్పిడికి వీలుగా బాప్తీస్మం ఘాట్ల నిర్మాణం చేపట్టడం దేనికి సంకేతం?
ఇది కాదా మత మార్పిడికి @ysjagan ప్రభుత్వ ప్రోత్సాహం అనడానికి నిదర్శనం. pic.twitter.com/V4tg7KcHJp— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 2, 2023
కాగా, సోము వీర్రాజు ట్వీట్‌తో బాప్టిస్ట్ ఘాట్ వివాదం మరింత పెద్దది కానుందని తెలుస్తోంది. బీజేపీ నేతలు వరుసగా ఘాట్ నిర్మాణ ప్రాంతం దగ్గర ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టెన్షన్ నెలకొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..