BJP-Janasena: పవన్‌కల్యాణ్‌ నాన్చుడు ధోరణిపై బీజేపీ గుస్సా.. పీకే-కమలం మధ్య మళ్లీ కటీఫ్ సౌండ్..

తుమ్మితే ఊడిపోయే పొత్తులు. ఎవరికి కోపమొచ్చినా అంతే సంగతులు. జనసేన-బీజేపీ చెలిమి మళ్లీ ఏపీలో రచ్చకెక్కింది. ఏ క్షణంలో ఐనా కటీఫ్‌ చెప్పుకోడానికి మానసికంగా సిద్దంగా ఉన్నాయంటూ రెండు పార్టీల మీద ఓ క్లారిటీకొచ్చేశారు జనం. అపూర్వ స్నేహితుల్లా కలిసున్న వీళ్లిద్దరికీ అప్పుడప్పుడూ గొడవలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీళ్ల మధ్య చిచ్చు పెట్టిందెవరు? ఎవరి నుంచి ఎవరు దూరం జరుగుతున్నట్టు? రాబోయే రోజుల్లో జనసేన ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం..

BJP-Janasena: పవన్‌కల్యాణ్‌ నాన్చుడు ధోరణిపై బీజేపీ గుస్సా.. పీకే-కమలం మధ్య మళ్లీ కటీఫ్ సౌండ్..
BJP-Janasena
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 22, 2023 | 11:26 AM

దోస్తులంటే ఇట్టా గూడా ఉంటారా…? కలిసే ఉంటారు, సిట్యువేషన్ డిమాండ్ చేస్తే.. అప్పుడప్పుడూ కుళ్లబొడుసుకుంటారు. మాటలతో మంటలేసుకుంటారు. ప్రాణానికి ప్రాణం ఇస్తుందా తీస్తుందా తెలీనంత గందరగోళపు దోస్తీ బీజేపీ అండ్ జనసేనది. అపూర్వ స్నేహితుల్లా కనిపిస్తారు గాని, కడుపుల్లో కత్తులు పెట్టుకునే కౌగిలించుకుంటారు. తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై అన్నట్టు.. వీళ్ల దోస్తీలో ప్రతీ మలుపు దగ్గిరా యాక్సిడెంట్లే. వీళ్లసలు మాట్లాడుకుంటున్నారా… కొట్లాడుకుంటున్నారా మనకైతే అర్థంగాదు. లేటెస్ట్‌గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు… జనసేనకూ, బీజేపీకీ మధ్య మంటలు పెట్టేశాయి. జనసేనతో కలిసున్నామా లేదా అనే సందేహాస్పద వాతావరణం వల్లే దెబ్బయిపోయాం అని సీనియర్ బీజేపీయులే ఓపెన్‌గా చెప్పడంతో.. వీళ్ల దోస్తీ కథ మళ్లీ క్లయిమాక్స్‌కొచ్చిందన్న డౌట్లు పుట్టేశాయి.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు 10 వేల 884 మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. ఇవి.. చెల్లని ఓట్ల కంటే తక్కువ. అందుకే ఏపీ కమలనాథులకు కడుపులో దేవినట్టయింది. జనసేన దూరం పాటించడమే ఓటమికి ప్రధాన కారణంగా పసిగట్టింది బీజేపీ పదాధికారుల సమావేశం. పైగా… గెలిచిన తెలుగుదేశం పార్టీ ఖాతాలో జనసేన ఓట్లున్నాయన్న క్లారిటీ బీజేపీకి తలవొంపుల్ని తెచ్చిపెట్టింది. అంతా నువ్వే చేశావ్… ఎటూ తేల్చకుండా ఆఖరికి కొంప ముంచేశావ్ అంటూ కమలనాథుల నుంచి డైరెక్ట్ ఎటాక్ షురూ కావడంతో జనసేన శిబిరం కూడా అంతే సూటిగా రియాక్టవుతోంది.

టోటల్‌గా కమలనాథుల ఫోకస్ పవర్‌స్టార్‌ మీదికే మళ్లింది. పవన్‌కల్యాణ్‌ మైండ్‌సెట్‌లోనే తేడాలొచ్చేశాయా, బీజేపీతో మైత్రి విషయంలో ఆయన బందరు సభలో చేసిన కామెంట్లే రచ్చకు దారితీశాయా? అనేవి కొత్త డౌట్లు. మీరు సక్రమంగా ఉంటే నాకు చంద్రబాబుతో పనేముంది అంటూ పవన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ బీజేపీ లోకల్ లీడర్లను గుచ్చిగుచ్చి చంపేస్తోంది.

మొన్న పవన్ అన్నదే కదా ఇప్పుడు మాధవ్ అన్నారు.. మీరంటే గొప్ప మేమంటే తప్పా అనే లాజిక్కుతో జనసేనతో కయ్యానికి దిగుతోంది ఏపీ కమలం పార్టీ. ఈ రెండు పార్టీలకీ మధ్య దూరం పెరగడానికి వైసీపీ తీరు కూడా ఓ కారణమన్న విషయాన్ని స్వయానా బీజేపీయులే ఒప్పుకుంటున్నారు. అధికార పార్టీతో అంటకాగుతున్నారు. కేంద్రంలో దోస్తీ.. రాష్ట్రంలో కుస్తీ అన్న చందంగా… డబుల్ స్టాండర్డ్స్‌తో నడుస్తున్నారు అంటూ జనం నుంచే బీజేపీ మీద విమర్శలు పడుతున్నాయి.

వైసీపీని ఓడించడమనే ఏకైక లక్ష్యంతో ముందుకు నడుస్తున్న జనసేనకీ, వైసీపీతో అంటకాగుతున్నట్టు అనుమానాలు కలుగజేసే బీజేపీకి మధ్య దోస్తీ కొనసాగడం అనేది దుర్భరం అనేది విశ్లేషకుల మాట. మొత్తంగా పొత్తుధర్మం పాటించడంలో ఇద్దరూ ఫెయిలౌతున్నారన్నదైతే క్లియర్. అసలీ దోస్తీ పుట్టుకే ఊహించని చిత్ర విచిత్రం. వీళ్ల నెయ్యం, వియ్యం, కయ్యం గురించి చెప్పుకోవాలంటే పాచిపోయిన రెండు లడ్డూల దగ్గిర మొదలుపెట్టుకోవాలి.

అంతలేసి మాటలన్న తర్వాత కూడా మోదీ మీద నాకు ప్రత్యేక అభిమానాలున్నాయ్… ప్రపంచస్థాయి నేతల్లో మోదీయే నా ఫేవరిట్ అని పదేపదే చెబుతూ వస్తారు పవన్‌కల్యాణ్. 2019 ఎన్నికల తర్వాత అమరావతి విషయంలో జగన్‌తో విభేదిస్తూ… బీజేపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న పవన్… అప్పటినుంచి డైలమాలోనే ఉన్నారు. తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో, నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా క్యాడర్‌ నిండా కన్ఫ్యూజనే. ఉమ్మడి కార్యాచరణ అనే మాటే ఎక్కడా లేదు. కలిసున్నంత మాత్రాన ఒకే మంచం, ఒకే కంచం అంటే ఎలా? మేం 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం… 17 పార్టీలతో పొత్తులో ఉన్నాం… అందులో జనసేన ఒకటి. తమిళనాడులో చూడండి… ఎన్నికలప్పుడే స్నేహం… మిగతా టైమ్‌లో ఎవరికివారే యమునా తీరే. ఇక్కడా అంతే అంటోంది ఏపీ బీజేపీ. ఇదే గ్యాప్‌లో వైజాగ్, కుప్పం ఎపిసోడ్స్‌లో చంద్రబాబు-పవన్‌ ములాఖత్ కావడం పొత్తు కథలో కొత్త మలుపు. బీజేపీ-టీడీపీ-జనసేన… ట్రయాంగిల్ లవ్వు రిపీటౌతుందా అనే చర్చ కూడా మొదలైంది.

బీజేపీ మాత్రం వైసీపీకీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తామనే కాన్సెప్ట్‌నే నమ్ముకోవడంతో జనసేన ప్లాన్‌B వైపు చూస్తున్నట్టు సంకేతాలొచ్చాయి. మీరు కలిసిరాకపోతే.. నా దారి నేను చూసుకుంటా అంటూ పదవ ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ క్లియర్ సిగ్నల్స్ ఇవ్వడం… ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చారంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేయడం… రెండు పార్టీల పొత్తు కథకు తూట్లు పొడిచేస్తున్నాయ్. ఎన్నికలకు మరో ఏడాది గ్యాప్ కూడా లేకపోవడంతో… జనసేన-బీజేపీ పొత్తు కహానీలో క్లయిమాక్స్ కమింగ్‌ సూన్… అనేది ఏపీలో తాజా గుసగుస.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం