Nagari Politics: ఎన్నికల ముందు మంత్రి రోజాకు బిగ్ షాక్.. పార్టీని వీడుతున్న అసమ్మతి వర్గం..!

మంత్రి రోజాకు ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే అసమ్మతి సెగ తగులుతోంది. ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రమవుతోంది. అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. విపక్షం నుంచే కాకుండా అధికారపక్షంలోని అసమ్మతి వర్గం నుంచే రోజాకు తలనొప్పి ఎక్కువైంది. ఎన్నికల వేళ అసమ్మతి నేతల రాజీనామాల పర్వం కీలక సమయంలో రోజాను కలవరపాటుకు గురిచేస్తోంది.

Nagari Politics: ఎన్నికల ముందు మంత్రి రోజాకు బిగ్ షాక్.. పార్టీని వీడుతున్న అసమ్మతి వర్గం..!
Rk Roja
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 05, 2024 | 9:17 AM

మంత్రి రోజాకు ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే అసమ్మతి సెగ తగులుతోంది. ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రమవుతోంది. అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. విపక్షం నుంచే కాకుండా అధికారపక్షంలోని అసమ్మతి వర్గం నుంచే రోజాకు తలనొప్పి ఎక్కువైంది. ఎన్నికల వేళ అసమ్మతి నేతల రాజీనామాల పర్వం కీలక సమయంలో రోజాను కలవరపాటుకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి దాకా మంత్రి రోజాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వ్యతిరేకవర్గం ఇప్పుడు వైసీపీని వీడుతుండడం వైసీపీ కేడర్ లో గందరగోళం నెలకొంది.

చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో ఒక్కసారిగా రాజకీయం కొత్త మలుపు తీసుకుంది.మంత్రి ఆర్కే రోజాను ఇబ్బంది పెట్టిన ఐదుగురు అసమ్మతి నేతల్లో నలుగురు తెలుగుదేశం పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు నేతలు పార్టీ వీడేందుకు రెఢి అవుతుండటంతో కీలక సమయంలో రోజాను కలవరపెడుతోంది. మంత్రి ఆర్కే రోజాకు తలనొప్పిగా మారిన వైసీపీలోని వ్యతిరేకవర్గం ఇప్పుడు టీడీపీలో చేరిపోయి అమితుమీ తెలుసుకునేందుకు సిద్ధమైంది.

నగిరి వైసీపీలో రోజా ఆమెకు వ్యతిరేకంగా 5 మండలాల్లోని 5 మంది నేతలు ఒక్కటిగా ఇప్పటిదాకా రాజకీయం చేస్తూ వచ్చారు. వైసీపీలోనే ఉంటూ ఆమెను వ్యతిరేకిస్తూ వచ్చిన అసమ్మతి వర్గం, రోజాకు టికెట్ దక్కకుండా అన్ని ప్రయత్నాలు చేసింది. రోజాకు టికెట్ ఇస్తే పని చేయమని అల్టిమేటం కూడా జారీ చేసింది. స్వయాన సీఎం జగన్ జోక్యం చేసుకున్న నగరి పంచాయతీ తేలకపోయింది. ఇక వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన ఆఖరి నిమిషం వరకు రోజాకు టికెట్ దక్కకుండా చేసిన అన్ని ప్రయత్నాలు బెడసి కొట్టడం, తిరిగి రోజాకే నగరి టికెట్ కట్టబెట్టడంతో అసమ్మతి వర్గం మరో దారిని వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే పుత్తూరుకు చెందిన ఏలుమలై, వడమాలపేట మండలానికి చెందిన ZPTC మురళీధర్ రెడ్డి, నిండ్ర మండలానికి చెందిన శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతి రాజు ఇలా నలుగురు టీడీపీ గూటికి చేరువయ్యారు. ఇక మిగిలింది నగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి ఆమె భర్త కేజే కుమార్ మాత్రమే. కాగా వీళ్లు కూడా రోజా ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు. ఇలా వైసీపీలోని అసమ్మతి నేతలు అంతా రోజా ఓటమి లక్ష్యంగా పెట్టుకున్నారట.

మంత్రి రోజాకు ఎన్నికల ముందు బిగ్ షాక్ ఇచ్చారు. రెండ్రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన నగరిలోని రోజా వ్యతిరేక వర్గం నేతల్లో మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, లక్ష్మిపతిరాజు సహా ఇద్దరు ఎంపీటీసీ, 6 మంది సర్పంచ్ లు, మరికొద్ది మంది కీలక నేతలు, అనుచరులు ఉన్నారు. గత 4 ఏళ్లుగా రోజాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీ సీనియర్లు రోజాకు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజా గెలిచిన తరువాత పార్టీ నేతలను పట్టించుకోలేదంటూ మీడియా ముందుకు వచ్చిన అసమ్మతి నేతలు గగ్గోలు పెట్టారు. పార్టీ సర్వేల్లోనూ ఆమె ఓడిపోతుందని తేలిందన్నారు. రోజా వల్ల నగరి ప్రజలు, కేడర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారనీ నగరి ప్రజలను ఆమె 10 ఏళ్లుగా దోచుకుందనీ ఆరోపించారు. ఎన్నో వేధింపులకు గురి చేసిందని విమర్శిస్తున్న నేతలు ఐరన్ లెగ్ రోజా ను గోల్డెన్ లెగ్ గా మార్చింది మేమేనంటున్నారు. రోజా తీరు నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించిన రోజా వ్యతిరేక వర్గం నేతలు బ్లాక్ మెయిల్ చేసి సీటు తెచ్చుకుందన్నారు. సీటు ఇవ్వకూడదని చెప్పినా పార్టీ పెద్దలు మమ్మల్ని పట్టించుకోలేదనీ, త్వరలో టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు నిండ్ర మండలానికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి.

ఇక ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన వడమాల పేట ZPTC మురళీధర్ రెడ్డి నగరిని రోజా, ఆమె కుటుంబ సభ్యులు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ చెబుతున్న చంద్రముఖి నగరిలో ఉండే రోజానేనన్నారు. మంత్రి పెద్దిరెడ్డి సపోర్టు తమకుందని ఆయన్ని రోడ్డుమీదకు లాగుతున్న రోజాను నగరి ప్రజలు ఓడించాలని కోరారు. లేదంటే నగరిలో ఏ భూమి మిగలదనీ, రోజా అవినీతికి అడ్డు అదుపులో లేకుండా పోయిందని విమర్శించారు. ప్రతి పనికి లంచం తీసుకుందని, రోజా అవినీతి పై విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు వడమాల పేట ZPTC మురళీధర్ రెడ్డి. .

అయితే రోజా ఇదేమీ పట్టించుకోకుండానే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మంత్రి రోజా. ఇంతకాలం పార్టీలోనే ఉంటూ అసమ్మతి వర్గంగా పనిచేస్తూ తలనొప్పిగా మారిన నేతలు పార్టీని విడిపోవడం పట్ల పెద్దగా పట్టించు కోకుండానే ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అసమ్మతి నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతుండటంతో కేడర్ లో మాత్రం అయోమయం నెలకొంది. ఎన్నికల భవితవ్యం తేల్చనున్న సమయం ఆసన్న మవుతుండగా అసమ్మతి నేతలు ఇచ్చిన షాక్ కేడర్ కి ఇబ్బందిగానే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…