AP News: ఇట్లు మాచర్ల నియోజకవర్గం.! పల్నాడులో పాపాలకు కారకులెవరు ?
మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. పాల్వాయి గేట్‌లో MLA పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారనే దానిపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు పోలింగ్ బూత్‌లో టీడీపీ నేతల ఆగడాలు చూడండి అంటూ వైసీపీ కూడా వీడియోను రిలీజ్ చేయడంతో..

మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. పాల్వాయి గేట్‌లో MLA పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారనే దానిపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు పోలింగ్ బూత్‌లో టీడీపీ నేతల ఆగడాలు చూడండి అంటూ వైసీపీ కూడా వీడియోను రిలీజ్ చేయడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
ఏపీ రాజకీయాలన్నీ ఈ వీడియో చుట్టూనే తిరుగుతున్నాయి. ఈవీఎంల ధ్వంసంపై బయటకు వచ్చిన వీడియో రియలేనంటున్న తెలుగుదేశం పిన్నెల్లి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. పోలింగ్ రోజు పాల్వాయి గేట్‌లో జరిగిన మొత్తం వీడియో ఫుటేజ్‌ను ఈసీ అధికారులు పరిశీలించాలని ట్వీట్ చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దీనిపై లీగల్ ఫైట్ చేయడానికి సిద్దంగా ఉన్నామన్న సజ్జల అదే ప్రాంతంలోని తుమ్రకోటలో టీడీపీ బీభత్సం చేసిన వీడియోలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు..పాల్వాయిగేట్ వీడియో బయటకు వచ్చినట్టే.. మిగతా 9 చోట్ల EVMల ధ్వంసం జరిగితే ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు వైసీపీ నేతలు.
అటు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియోపై సీఈవో మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియో ఎలక్షన్ కమిషన్ నుంచి విడుదల కాలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే వీడియో ఎలా బయటకు వెళ్లిందో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ ఎపిసోడ్‌లో పాల్పాయిగేటు పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశామన్నారు మీనా. అటు మాచర్లలో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. ఈ సమయంలో టీడీపీ నేతలు ఛలో మాచర్ల సరికాదన్నారు. ఒకవేళ టీడీపీ నేతలు అక్కడికి వెళ్తే మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్నారు. టీడీపీ నేతలు మాత్రమే కాదూ.. బయటి వ్యక్తులెవరూ పరామర్శకు మాచర్లకు వెళ్లొదన్నారు ఈసీ సీఈవో.
ఎన్నికల జరిగిన వారం తర్వాత అల్లర్లకు సంబధించిన వీడియోలు ఒక్కక్కటిగా బయటకు వస్తున్నాయి. పార్టీల మధ్య అవే అస్త్రాలుగా మారుతున్నాయి. ఇంతకీ పల్నాడులో కూటమి కవ్వింపులకు పాల్పడిందా? లేక పిన్నెల్లిని వైసీపీ ప్రయోగించిందా? ముందస్తు సమాచారం ఉన్నా శాంతిభద్రతలు కాపాడటంలో ఈసీ విఫలమైందా?
