జైల్లో చంద్రబాబుపై కుట్ర జరుగుతోందా? ఏపీలో అట్టుడుకుతున్న రాజకీయాలు..
ఢిల్లీ నుంచి గల్లీ దాకా చంద్రబాబు అరెస్టు చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య అసెంబ్లీ వాయిదా పడితే.. అటు ఢిల్లీలో చంద్రబాబు హత్యకు కుట్ర అంటూ పరస్పర ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు పెరుగుతుందని టీడీపీ అంటుంటే..

ఢిల్లీ నుంచి గల్లీ దాకా చంద్రబాబు అరెస్టు చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య అసెంబ్లీ వాయిదా పడితే.. అటు ఢిల్లీలో చంద్రబాబు హత్యకు కుట్ర అంటూ పరస్పర ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు పెరుగుతుందని టీడీపీ అంటుంటే.. అరెస్టు భయంతో లోకేష్ కూడా ఢిల్లీకి పారిపోయారంటోంది వైసీపీ.
రెండువారాలుగా ఏపీ రాజకీయాలన్నీ కూడా చంద్రబాబు అరెస్టు చుట్టూనే తిరుగుతున్నాయి. సిఐడీకి, చంద్రబాబుకు మధ్య లీగల్ ఫైట్ నడుస్తుండగానే ఇటు పొలిటికల్ ఫైట్ ఢిల్లీదాకా చేరింది. ప్రత్యేకంగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనూ చంద్రబాబు అరెస్టు వ్యవహారం రచ్చ రాజేసింది. నిన్నరాజ్యసభలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇండియా కూటమి ఎంపీలతో పాటు బీఆర్‌ఎస్ ఎంపీ కే.కేశవరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంతకుముందు లోక్‌సభలో తొలిరోజు కూడా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటలయుద్ధం చోటుచేసుకుంది.
ఇక ఏపీలో మొదలైన అసెంబ్లీ సమావేశాల్లోనూ తొలిరోజు చంద్రబాబు అరెస్టు చుట్టూనే మాటలమంటలు నడిచాయి. సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్రగందరగోళం నెలకొంది. అసెంబ్లీ ఆస్తులకు నష్టం కలిగించేలా ప్రవర్తించిన అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి, పయ్యావుల కేశవ్‌లను సెషన్ మొత్తం సస్పెండ్ చేయగా.. 15 మందిని ఒక్కరోజు సస్పెండ్ చేశారు
మరోవైపు చంద్రబాబు హత్యకు కుట్ర అంటూ టీడీపీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. టీడీపీ అధినేత భద్రతపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేయగా.. దీనిపై తీవ్రంగా ప్రతిస్సందించింది వైసీపీ. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టు పరిణామాలపై పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. అవినీతి జరిగిందా లేదా? అన్న చర్చ కంటే కూడా కక్ష, కార్పణ్యాల చుట్టూనే రచ్చ జరుగుతోంది? మరి ఇది రాజకీయంగానూ ఎవరికి లాభం ఎవరికి నష్టం..!




