Andhra Pradesh: ఏపీలో మళ్లీ ఒక్కటైన పాత మిత్రులు!.. పాచిపోయిన లడ్డూలను గుర్తుచేస్తున్న ప్రత్యర్థులు!
ఏపీలో పొత్తుల రాజకీయం కుతకుతలాడుతోంది. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ జట్టుకట్టడం దాదాపు ఖరారవడంతో.. రాజకీయం రంగులు మారే సూచనలు కనిపిస్తునాయి. సీట్ల సర్దుబాటు జరిగితే.. కాషాయ పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడైనా రావొచ్చు. అయితే, కూటమిలో సీట్ల పంపకాలపై సీరియస్‌గా చర్చజరుగుతున్న వేళ... పాత మిత్రుల కలయికపై ప్రత్యర్థులు కారాలు, మిరియాలు నూరుతుండటం.. వ్యవహారాన్ని మరింత హీటెక్కిస్తోంది.
ఆంధ్రా రాజకీయాల్లో 2014 కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. 2019కు ముందు బీజేపీతో విడిపోయిన టీడీపీ… ఇప్పుడు జనసేనతో కలిసి మరోమారు ఎన్టీఏతో జట్టుకడుతోంది. ఇప్పటికే సీట్లను కూడా ప్రకటించిన జనసేన, టీడీపీ కూటమి… బీజేపీని కూడా జతచేసుకునేందుకు ఢిల్లీస్థాయిలో చర్చలు జరిపింది. మూడుపార్టీల పొత్తు దాదాపు ఖరారైపోగా… కాషాయసేనకు కేటాయించే సీట్లు ఏవనేదే తేలాల్సి ఉంది. టీడీపీ ఆఫర్ చేసిన సీట్లకంటే ఎక్కువగా బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పట్టువిడుపులు ఉంటే.. అధికారిక ప్రకటన ఆలస్యం కాకపోవచ్చు.
అయితే, కూటమిలోకి బీజేపీ ఎంట్రీ… రాష్ట్ర రాజకీయాల్లో కుతకుతలకు కారణమవుతోంది. 2014 ఫలితాలు రిపీట్ చేస్తామని కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా… ప్రత్యర్థి పార్టీలు మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇది కొత్త ప్యాకేజీతో వస్తు్న్న పాతకూటమే అంటూ ఎద్దేవా చేస్తోంది వైసీపీ. మూడుకాళ్ల కుర్చీలాంటి ఈ కూటమి కూలడం ఖాయమంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్లు విసిరారు విజయసాయిరెడ్డి. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా .. ఒంటరిగా ఎదుర్కొనడానికి సిద్ధమంటోంది వైసీపీ.
బీజేపీతో టీడీపీ, జనసేన జతకట్టడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అప్పుడు నచ్చని పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు బాగున్నాయా? అంటూ సెటైర్ వేసింది. రాష్ట్ర ప్రయోజనాలను మోదీ దగ్గర టీడీపీ,జనసేన తాకట్టు పెట్టాయంటూ ఆరోపణలు గుప్పించింది సీపీఎం. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా… టీడీపీపై మాత్రం సానుకూలత లేదని చెప్పింది.
ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. 2014 కాంబినేషన్ రిపీట్ కావడంతో, ఫలితం కూడా అదే తరహా ఉంటుందని తెలుగుసేన భావిస్తోంది. హిస్టరీ రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి రెండు పార్టీలు. మరి, భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి