Ongole: మద్యం మత్తులో అమ్మాయిలను వేధించిన యువకులు.. తిరగబడి దేహ శుద్ధి చేసిన యువతులు
ఒంగోలులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు..ఓ రెస్టారెంట్‌లో పనిచేసే యువతులపై కొంతమంది యువకులు లైంగికంగా వేధించడమే కాకుండా దాడి చేసి దారుణంగా కొట్టిన సంఘటన నగరంలో కలకలం రేపింది.
ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగింది.. ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతులపై స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు దాడి చేసి దారుణంగా కొట్టారు.. లైంగికంగా వేధించారు.. ఒంటిపై చేతులు వేసి హింసించారు.. దీంతో యువతులు తిరగబడ్డారు.. తమ సహచరుల సాయంతో ఆ ఇద్దరు యువకులను దేహశుద్ది చేశారు.. అనంతరం యువతులకు చెందిన వారితో స్థానిక యువకులకు చెందిన మరికొందరు చేరి పెద్ద ఎత్తున గొడవకు దిగారు. ఇరువర్గాలు నడిరోడ్డుపై కర్రలతో బీభత్సం సృష్టించారు.. దీంతో భీతిల్లిపోయిన యువతులు, వారి సహచరులు పారిపోయి రెస్టారెంట్‌లో దాక్కున్నారు.. అయినా విడిచిపెట్టకుండా యువతులు దాక్కున్న రెస్టారెంట్‌పై యువకులు దాడికి ప్రయత్నించారు.. అర్దరాత్రి గంటపాటు నానా హంగామా సృష్టించారు.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో ఉన్న బిలాల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు స్టీవార్డులు, వెయిటర్లుగా పనిచేస్తున్నారు.. పశ్చిమబెంగాల్, ఒరిస్సా, నేపాల్ నుంచి వచ్చిన కొంతమంది యువతులు ఎక్కువగా ఒంగోలులోని పలు రెస్టారెంట్లు, హోటళ్ళలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.. రాత్రి వేళల్లో రెస్టారెంట్లలో పనిముగించుకుని వెళుతున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు, మందుబాబులు యువతులను లైంగికంగా వేధించడం పరిపాటిగా మారింది. ఇలాంటి సంఘటనలపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆకతాయిలు వెరవడం లేదు.. ఈ క్రమంలో రాత్రి బిలాల్ రెస్టారెంట్లో పనులు ముగించుకుని హాస్టల్‌కు వెళుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతులపై స్థానిక యువకులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో యువతులు తిరగబడ్డారు. దీంతో రెచ్చిపోయిన స్థానిక యువకులు యువతులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరు యువతులతో పాటు పలువురు యువకులకు గాయాలయ్యాయి.. నేపాల్‌కు చెందిన సోనియా అనే యువతి ముఖం, చేతులు, శరీరంపై గాయాలు కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది.. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి సపర్యలు చేశారు. ఈ సంఘటనపై యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అర్ధరాత్రి నడిరోడ్డుపై జరిగిన హంగామాను కొంతమంది సెల్‌ఫోన్లలో రికార్డు చేస్తే, మరికొన్న విజువల్స్ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.. గతంలో కూడా ఇదే విధంగా కొంతమంది యువకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఈ విధమైన దాడులు జరుగుతున్నాయని, తమకు పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
ఒంగోలులో హోటల్ వ్యాపారంలో ఉద్యోగాలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువతుల పట్ల స్థానిక యువకులు దాడులు చేయడం, లైంగికంగా వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారిందని బిలాల్ హోటల్ యజమాని వాపోతున్నారు..ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యువతులకు స్తానికంగా ఎలాంటి సపోర్ట్ ఉండదన్న ఆలోచనతో రాత్రి వేళల్లో కొంతమంది ఆకతాయిలు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు రెస్టారెంట్లలో పనిచేసే యువతులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ఒంగోలు అర్దరాత్రి జరిగిన ఈ ఘర్షణకు సంబంధించి సిసి కెమెరా పుటేజ్‌ను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామంటున్నారు.. పోలీసుల సర్వేలెన్స్ కెమెరాల్లో రికార్డయిన సిసి పుటేజ్‌ను పరిశీలించిన తరువాత నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామంటున్నారు.. సిసి కెమెరా పుటేజ్‌ను పరిశీలించిన తరువాత పూర్తి వివరాలు చెబుతామంటున్నారు.
Report: Fairoz
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..