Model Driving School: నైపుణ్యవంతమైన డ్రైవర్‌గా మారాలనుకుంటున్నారా.. అయితే మీరు అక్కడికి వెళ్లాల్సిందే!
దేశాభివృద్ధిలో రవాణా రంగానిది కీలక పాత్ర. అలాంటి రవాణా రంగంలో డ్రైవర్లకు ఒకప్పుడు మంచి గుర్తింపు ఉండేది. అయితే ప్రస్తుత సమాజంలో నిష్ణాతులైన వాహన చోదకులు దొరకడమే కష్టంగా మారింది. సరైన శిక్షణ లేకపోవడం, అనుభవం లేకుండా వాహనాలు రోడ్డెక్కడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే మార్కెట్‌లో నైపుణ్యం గల డ్రైవర్లను అందించి, ప్రమాదాల నివారించేందుకు కృష్ణా జిల్లా లారీ అసోసియేషన్ సిద్దమైంది.హెవీ వెహికిల్ డ్రైవింగ్‌లో లక్షలాది మందికి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఎంతోమంది ఉపాధికి తోడ్పడుతుంది.

ప్రస్తుతం మార్కెట్ లో నైపుణ్యం గల డ్రైవర్ల కొరతను దృష్టిలో పెట్టుకొని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఒక వినూత్న కార్యక్రమానికి తెరతీసింది. అదే ప్రస్తుతం విజయవాడకు 32 కిలోమీటర్ల దూరంలో అంపాపురంలో ఉన్న కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. నాణ్యమైన డ్రైవర్లను తీర్చిదిద్దటానికి తామే డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో అప్పట్లో అసోసియేషన్‌లో క్రియాశీలకంగా ఉన్న వైవీ ఈశ్వరరావు నేతృత్వంలో రవాణా శాఖను సంప్రదించి. 1991లో గూడవల్లిలో 4,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు ప్రోత్సాహకాలు కల్పించటంతో 1993లో అంపాపురం దగ్గర 19 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్జి సెంటర్‌ను నెలకొల్పారు. క్రమేపీ ఈ సంస్థ గుర్తింపు పొందడంతో 2005 లో మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చెందింది. అప్పటి నుంచి ఇక్కడ వేలాది మంది ఆశావహులకు శిక్షణ ఇచ్చి ఉత్తమ డ్రైవర్లగా తీర్చిదిద్దుతోందీ సంస్థ.
నిజానికి 90 వ దశకం ఆ సమయంలో కృష్ణా జిల్లా ముఖ్యంగా విజయవాడ రావాణా హబ్ గా ఉండేది. ఈ ప్రాంతంలో నిత్యం వందలాది లారీలు ట్రాన్స్పోర్ట్ కు అవసరమయ్యేవి. దీంతో అప్పట్లో నిష్ణాతులైన డ్రైవర్ల కొరత కూడా ఎక్కువగా ఉండేది. ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని లారీ ఓనర్స్ అసోసియేషన్ డ్రైవింగ్ స్కూల్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. అనుకున్నదే తడవుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ఎంతోమంది నైపుణ్యం గల వాహన చోదకులను తయారు చేస్తోందీ సంస్థ. ఇప్పటి వరకూ లక్షా 30 వేలకు మందికి పైగా హెవీ వెహికిల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారి ఉపాధికి మంచి పునాది వేస్తూ ప్రశంశలు అందుకుంటుంది.
కేవలం హెవీ వెహికిల్స్ కు సంబంధించి ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన శిక్షకులు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఒకేసారి 500 మందికి శిక్షణ ఇచ్చేలా వసతులు కల్పించారు. ముఖ్యంగా మోడ్రన్ డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రంతో దేశంలోనే అగ్రగామిగా ఈ ట్రైనింగ్ సెంటర్ నిలుస్తోంది. ఇక్కడ10th, ఇంటర్, డిగ్రీ చదివి డ్రైవింగ్ ఆసక్తి ఉన్న ఎంతో మంది నిరుద్యోగులకు కేవలం 32 రోజుల్లో రోజుకు 8 గంటల పాటు ఇచ్చే శిక్షణలో నిష్ణాతులైన డ్రైవర్లగా తయారై మార్కెట్ లో ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా ప్రైవేటు సంస్థ ద్వారా లైసెన్సుల జారీ విధానం ఉమ్మడి కృష్ణాజిల్లాలో అమల్లోకి రావడంతో ఈ మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చి సెంటర్‌లో శిక్షణ పొందినవారు సంబంధిత టెస్ట్ ల అనంతరం లైసెన్సులు కూడా పొందవచ్చు. హెవీ వెహికల్ లైసెన్స్‌లు కలిగిన వారితో పాటు లైట్ మోటారు వెహికల్, ద్విచక్రవాహనాల డ్రైవింగ్ లైసెన్సుల జారీకి కూడా శిక్షణ ఇస్తోందీ సంస్థ.
వీడియో చూడండి..
కేవలం డ్రైవింగ్ శిక్షణ మాత్రమే కాకుండా ప్రయాణ మార్గంలో ఒడిదుడుకులు ఎదురైనపుడు ఎలా అధిగమించాలి. రాత్రి వేళల్లో వాహనాలకు ఎదురయ్యే సమస్యలేంటి? వాటిని ఎలా దాటాలి? లాంటి అంశాలను అనుభవజ్ఞులై ట్రైనర్స్ క్షుణ్ణంగా వివరించి నేర్పుతున్నారని చెబుతున్నారు ఇక్కడ శిక్షణ పొందుతున్న యువకులు. అలాగే ఇంజిన్ రకాలు దానికి సంబంధించిన మెళుకువలు, వాహనంలో సమస్య తలెత్తినపుడు ఎలా కనిపెట్టాలి, సాంకేతిక పరికరాల రిపేర్ లు వంటి ఎన్నో అంశాలపై కూడా పట్టు సాధించవచ్చని చెబుతున్నారు. ఇక్కడ శిక్షణ పొందితే కచ్చితంగా మంచి ఉద్యోగం లభించడమే కాకుండా ఉత్తమ డ్రైవర్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సహకారంతోనే ఈ శిక్షణ సంస్థను ఇంత అభివృద్ధి చేశామని, ఇపుడు డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ కు కూడా అనుమతి లభించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారమందిస్తే మరింత అభివృద్ధి చేసి ఎంతో మంది యువతకు శిక్షణ ఇవ్వొచ్చని చెబుతున్నారు అసోసియేషన్ సభ్యులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.