ఏపీ వైసీపీలో తీవ్ర విషాదం.. బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీ మరో విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య(62) కన్నుమూశారు.

ఏపీ వైసీపీలో తీవ్ర విషాదం.. బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత
Badvel Mla Venkata Subbaiah Passed Away
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 28, 2021 | 9:37 AM

Badvel mla venkata subbaiah: ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీ మరో విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య(62) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఇటీవల ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లో చికిత్స పొంది కడపలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. మళ్లీ అనారోగ్యం బారిన పడిన ఎమ్మెల్యే కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇంటర్‌ చదువుతున్న కుమారుడు, ఎంబీబీఎస్‌ నాలుగో ఏడాది చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

ఎమ్మెల్యే స్వస్థలం బద్వేలు పురపాలకలోని మల్లెలవారిపల్లి. మారుమూల గ్రామంలో జన్మించినా.. వైద్య వృత్తిని చేపట్టాలని వెంకట సుబ్బయ్య కర్నూలు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చేశారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. అనంతరం కామినేని, అపోలో ఆస్పత్రుల్లో కొంతకాలం సేవలు అందించారు. ఈయన భార్య కూడా వైద్యురాలిగా స్థిరపడ్డారు. 2016లో ఆయన బద్వేల్‌ వైసీపీ కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా, నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని ఈ మధ్యాహ్నం బద్వేలు తీసుకెళ్లనున్నారు.

వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానుల్లో తీవ్ర విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.వెంకట సుబ్బయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీలో ఒక అప్తుడిని కోల్పోయానన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండిః పంజాబ్ రైతుల ఆగ్రహం.. కొత్త చట్టాలకు మద్దతుగా మాట్లాడిన ఎమ్మెల్యేపై దాడి.. ఖండించిన సీఎం అమరీందర్