అయ్యారే.. ఎంతకు తెగించార్రా! ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీనెయ్యి!
ఆత్రేయ రాసిన పాటలు ఎంత గొప్పగా ఉంటాయో... ఆత్రేయపురం పూతరేకులు కూడా అంతే బాగుంటాయ్. ఆ పేరే ఒక బ్రాండ్. ప్రత్యేకంగా ప్రచారమే అవసరం లేదు. ఆవురావురుమని లొట్టలేసుకుని తినే స్వీట్ లవర్స్ కోకొల్లలుగా ఉంటారు. అలా తినేవారికి.. ఇదో షాకింగ్ న్యూస్. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు.. వీటిని కూడా డూప్లికేట్ చేసేస్తున్నారట కేటుగాళ్లు.

ఆత్రేయపురం పూతరేకులంటే ఇష్టపడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆలిండియా కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువారందరికీ ఎంతో ఇష్టమైన తీపి పదార్థం ఇది. అలాంటి పూతరేకుల తయారీ విషయంలో… షాకింగ్ నిజాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో.. స్థానికంగా పూతరేకులు, స్వీట్స్ తయారీ కేంద్రాలపై… ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మికదాడులు చేశారు. అక్కడ వాడే నెయ్యి పదార్థాల శాంపిల్స్ అనుమానంగా ఉండటంతో… పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపించారు.
ల్యాబ్‌కు నెయ్యి శాంపిల్స్
21శాంపిల్స్ సేకరించి పరీక్షించిన అధికారులు… కల్తీ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తిస్థాయి ల్యాబ్ టెస్టుల తర్వాతే… అది కల్తీనా? కాదా? అన్నది తేలుతుందని చెబుతున్నారు. ఒకవేళ కల్తీ అని తేలితే మాత్రం… నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆత్రేయపురం ప్రాంతంలో పూత రేకులు ప్రపంచవ్యాప్తంగా జియోగ్రాఫికల్ గుర్తింపు పొంది, ప్రజాదరణ పొందాయి. అలాంటి బ్రాండ్‌ని కాపాడుకునేందుకు… తయారీదారులు బ్రాండెడ్ నెయ్యి, నాణ్యమైన పదార్థాలు మాత్రమే వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎన్నిసార్లు తనిఖీలు చేసినా ఇంతేనా?
పూతరేకుల తయారీ కేంద్రంగా ఉన్న ఆత్రేయపురంలో అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు నిర్వహించినా కొందరు వ్యాపారుల్లో మార్పు రావడం లేదంటున్నారు స్థానికులు. కొందరు చేసిన తప్పు.. ఇప్పుడు అందరి మెడకు చుట్టుకున్నట్టయ్యింది. దీంతో బ్రాండెడ్ పూతరేకుల నాణ్యతపైనే అనుమానాలు రేకెత్తించేలా తయారైంది పరిస్థితి. పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారంటూ ఫిర్యాదులు అందడంతో.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. నేరుగా రంగంలోకి దిగింది. నాణ్యతను పరిశీలించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
పూతరేకుల షాపులు, నెయ్యి సరఫరా చేసే వ్యాపారులు
పూతరేకుల షాపులపైనా… ఆ షాపులకు నెయ్యి సరఫరా చేస్తున్న హోల్సేల్ వ్యాపార దుకాణాలపై… దాడులు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పూతరేకుల తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యిని పరిశీలించి నమూనాలను కలెక్ట్ చేసి ల్యాబ్‌కుపంపించారు. ప్రాథమికంగా కల్తీ నిర్ధారణ అయినప్పటికీ… ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారమే చర్యలు ఉంటాయంటున్నారు అధికారులు.
ఆత్రేయపురం అంటేనే పూతరేకులు..!
ఆత్రేయపురం అంటేనే పూతరేకులు… పూతరేకులంటేనే ఆత్రేయపురం అన్నట్టుగా బ్రాండ్ ఇమేజ్ ఉంది. అలాంటిది…. ఇప్పుడీ కల్తీ వ్యవహారంతో ఈ బ్రాండ్ ఇమేజ్‌ని డ్యామేజ్ అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది వాడే కల్తీ నెయ్యి వల్ల… మిగిలిన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ముచ్చటా వినిపిస్తోంది. అలాంటివారి వల్ల ఏళ్లుగా ఆత్రేయపురం పూతరేకులకు ఉన్న మంచిపేరు.. పోతోందని స్థానికులు వాపోతున్నారు. అయితే ఇక్కడ అధికారులు ఇలాంటి దాడులు చేయడం కొత్తేం కాదు. గత మే నెలలోనూ… కల్తీ నెయ్యి వాడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేశారు అధికారులు. పది షాపులకు నోటీసులిచ్చారు. అయినా వారిలో మార్పులేదని… లేటెస్ట్ రైడ్స్‌తో స్పష్టమవుతోంది. ఆత్రేయపురం పూతరేకుల బ్రాండ్ దెబ్బతినకుండా ఉండేందుకు… అధికారులు, ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
