రూ.200 కూపన్‌తో రూ.50 లక్షల ఫార్చ్యూనర్.. ఆరేళ్ల బాలుడికి జాక్‌పాట్!
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు మెదాన్ష్ రైక్వార్‌కు రూ.200 లక్కీ డ్రా కూపన్‌తో రూ.50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు లభించింది. అతడి నానమ్మ గతేడాది గార్బా వేడుకలో మనవడి పేరుతో కూపన్ కొనుగోలు చేశారు. .. ..

అదృష్టం ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కేవలం రూ.200 పెట్టి కొనుగోలు చేసిన లక్కీ డ్రా కూపన్ ఓ కుటుంబానికి ఏకంగా రూ.50 లక్షల విలువైన కారును అందించింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు మెదాన్ష్ రైక్వార్‌ను ఈ అదృష్టం వరించింది. గార్బా వేడుకలో అతడి నానమ్మ కొనుగోలు చేసిన కూపన్‌కు మొదటి బహుమతిగా టయోటా ఫార్చ్యూనర్ కారు లభించింది.
బుర్హాన్‌పూర్‌లోని సీలంపురాకు చెందిన కిరణ్ రైక్వార్ గతేడాది అభాపురిలోని శ్రీ సర్కార్ ధామ్‌లో నిర్వహించిన గార్బా వేడుకలకు వెళ్లారు. అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన లక్కీ డ్రా కోసం రూ.200తో ఒక కూపన్ కొనుగోలు చేశారు. అయితే ఆ కూపన్‌పై తన పేరు కాకుండా మనవడు మెదాన్ష్ పేరు నమోదు చేశారు. అప్పుడు ఆమెకు తెలియదు.. ఆ చిన్న కూపనే తమ కుటుంబానికి ఇంతటి ఆనందాన్ని తీసుకొస్తుందని!
దాదాపు ఏడాది తర్వాత 2026లో లక్కీ డ్రా విజేతల పేర్లను ప్రకటించారు. అందులో మొదటి బహుమతి మెదాన్ష్‌ను వరించింది. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రూ.200తో తీసుకున్న కూపన్‌కు సుమారు రూ.50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు రావడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
బాలుడికి బహుమతిగా కారు వచ్చిందన్న విషయం తెలియడంతో సీలంపురాలో సందడి నెలకొంది. స్థానికులు డప్పుల మోతల మధ్య మెదాన్ష్‌కు ఘన స్వాగతం పలికారు. కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. తమకంటూ ఓ కారు ఉండాలన్న కుటుంబ కోరిక ఇలా ఊహించని విధంగా నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఈ వింత అదృష్టానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. రూ.200 కూపన్‌తో ఇంత ఖరీదైన కారు గెలుచుకోవడం ఎలా సాధ్యమైందంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు బాలుడికి అభినందనలు తెలుపుతున్నారు.
ఫార్చ్యూనర్ ప్రత్యేకతలివే..
టయోటా ఫార్చ్యూనర్ ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన ప్రీమియం ఎస్‌యూవీ. దృఢమైన నిర్మాణం, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు అనువైన సామర్థ్యం దీని ప్రత్యేకతలు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో లభిస్తుంది. ఇలాంటి ఖరీదైన కారు తమ కుటుంబానికి లభించడంతో మెదాన్ష్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.
