AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్.. పంబా నది విషయంలో ఈ తప్పులు చేయొద్దు!

Sabarimala Yatra 2026 Pamba River Cleanliness: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పంబా నదిలో దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వ్యర్థాలు వేయకుండా అవగాహన కల్పించేందుకు KSRTC బస్సుల్లో ప్రత్యేక ఆడియో సందేశాలు వినిపించాలని సూచించింది. అలాగే ఎరుమేలి పార్కింగ్ ప్రాంతంలో చెత్త తొలగించాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డును ఆదేశించింది.

Sabarimala: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్.. పంబా నది విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Sabarimala Yatra 2026 Pamba River Cleanliness
Rajashekher G
|

Updated on: Nov 20, 2026 | 3:54 PM

Share

Sabarimala Pamba River Cleanliness: అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో మాలధారణ చేసి, దీక్ష చేపడతారు. మండల కాలం పాటు కఠినమైన నియమాలను పాటిస్తూ స్వామివారి దర్శనం కోసం యాత్ర సాగిస్తారు. అయితే, ఈ పవిత్ర యాత్రలో భక్తులు పాటించాల్సిన మరో ముఖ్యమైన బాధ్యత ఉంది. అదే ప్రకృతి పరిరక్షణ, పవిత్ర నదుల పరిశుభ్రత. ముఖ్యంగా శబరిమల యాత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పంబా నది పవిత్రతను కాపాడుకోవాలని కేరళ హైకోర్టు భక్తులకు కీలక సూచనలు చేసింది.

బస్సుల్లో ప్రత్యేక ఆడియో సందేశాలు

శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు పంబా నదిలో దుస్తులు, ఇతర వ్యర్థాలను పడేయకుండా అవగాహన కల్పించాలని కేరళ హైకోర్టు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)ను ఆదేశించింది. యాత్రికులు ప్రయాణించే బస్సుల్లో, భక్తులు బస్సులు ఎక్కే బస్టాండ్లలోనూ ముందుగా రికార్డు చేసిన ఆడియో సందేశాలను వినిపించాలని సూచించింది. జస్టిస్ వి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం శబరిమల ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నెలవారీ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ ఆదేశాలు జారీ చేసింది. పంబా నదిలో భక్తులు దుస్తులు, ఇతర వ్యర్థాలను పడేస్తున్నారనే విషయాన్ని ప్రత్యేక కమిషనర్ తన నివేదికలో ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో యాత్రికులను తరలించే అన్ని బస్సుల్లో స్పీకర్లను ఏర్పాటు చేయాలని KSRTCకి కోర్టు స్పష్టం చేసింది. వివిధ భాషల్లో రూపొందించిన ఆడియో సందేశాలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) KSRTCకి అందజేయాలని ఆదేశించింది. ఈ సందేశాల ద్వారా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించవద్దని, నదిలో దుస్తులు, చెత్త వేయవద్దని భక్తులకు అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా సింథటిక్ కుంకుమ, ప్రకృతిలో త్వరగా కలిసిపోని ఇతర వస్తువులను యాత్ర సమయంలో ఉపయోగించకుండా ఉండాలని కూడా సూచించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఎరుమేలి ప్రాంతంలో చెత్త తొలగింపునకు ఆదేశాలు

మరోవైపు ఎరుమేలి గ్రామ పంచాయతీ చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన హైకోర్టు అక్కడి పార్కింగ్ ప్రాంగణంలోనూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. పార్కింగ్ ప్రాంతంలోని మరుగుదొడ్లు, స్నానపు గదుల చుట్టూ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు సూచించింది. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన అన్ని సూచిక బోర్డులపై వాహనాల పార్కింగ్‌కు అనుమతించిన సమయ పరిమితిని స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించింది.

పంబా నది పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

శబరిమల యాత్ర అనేది కేవలం స్వామివారి దర్శనం మాత్రమే కాదు.. ప్రకృతి పట్ల భక్తి, బాధ్యతను చాటుకునే పవిత్రమైన ప్రయాణం కూడా. అయ్యప్ప స్వామి భక్తులు పంబా నదిలో స్నానాలు ఆచరించే సమయంలో పరిసరాలను అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్, దుస్తులు, ఇతర వ్యర్థాలను నదిలో వేయకుండా నిరోధించాలి. పంబా నది పరిశుభ్రతను కాపాడటం ద్వారా రాబోయే తరాలకు కూడా ఈ పవిత్ర పుణ్యక్షేత్ర సహజ సౌందర్యాన్ని అందించవచ్చు. స్వామివారి సన్నిధికి వెళ్లే ప్రతి భక్తుడు ఈ బాధ్యతను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

Follow Us