AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Siraj: తొలుత వన్డేలు, ఇప్పుడు టెస్ట్‌లకు దూరం.. సిరాజ్‌ చుట్టూ అసలేం జరుగుతోంది..! 

Mohammed Siraj: వెల్లింగ్టన్ టెస్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను తప్పించడంపై తీవ్ర దుమారం రేగింది. జట్టు కూర్పులో భాగమేనని కోచ్ సితాన్షు కోటక్ సమర్థించుకోగా అశ్విన్ తీవ్రంగా మండిపడ్డాడు. మతం కోణం లేదని గంభీర్ కోచ్ స్పష్టం చేశాడు. సిరాజ్ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ సాగుతోంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంపిక వ్యూహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Mohammed Siraj: తొలుత వన్డేలు, ఇప్పుడు టెస్ట్‌లకు దూరం.. సిరాజ్‌ చుట్టూ అసలేం జరుగుతోంది..! 
Ind Vs Nz 1st Test Mohammed Siraj
Venkata Chari
|

Updated on: Nov 20, 2026 | 5:16 PM

Share

Mohammed Siraj: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు. జట్టు కూర్పులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, సిరాజ్‌లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. భారత్ ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లను పేసర్లుగా ఎంచుకోగా, స్పిన్ ఆప్షన్‌గా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంది. ఒక్కరోజు కోసం కాకుండా ఐదు రోజుల మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేశామని కోటక్ అన్నారు.

“సిరాజ్‌లో తప్పేం లేదు. జట్టును ఎంపిక చేసేటప్పుడు ఇదే ఉత్తమ ప్లేయింగ్ ఎలెవన్ అని భావించాం. సిరాజ్‌ను తప్పించడం తప్పుడు నిర్ణయం అని నేను అనుకోవడం లేదు. ఇది కేవలం తొలి రోజు మాత్రమే. మేము జట్టును ఒక్కరోజు కోసం కాకుండా రెండు, మూడు, నాలుగో రోజుల కోసం కూడా ఎంపిక చేస్తాం” అని కోటక్ విలేకరులతో అన్నారు.

సుందర్ ఎంపిక వెనుక కారణం..

వాషింగ్టన్ సుందర్‌ను ఎందుకు తీసుకున్నారో కోటక్ వివరించారు. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌లో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటమే కారణమని చెప్పారు.

“వాళ్ల టాప్ ఆర్డర్‌లో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు కాబట్టి వాషీని ఎంచుకున్నాం. ఈ మ్యాచ్‌కు ఇదే ఉత్తమ బౌలింగ్ దాడి” అని అన్నారు.

ఎక్కువమంది చదివినది: పాకిస్తానోళ్లు ఎప్పటికీ మారరు.. సొంత టీంపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..!

భారత్ బంతితో శుభారంభం చేసి న్యూజిలాండ్‌ను 60/4కు పరిమితం చేసింది. బుమ్రా నేతృత్వంలో తొలి సెషన్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. అయితే 30వ ఓవర్ తర్వాత కుకబురా బంతి మెరుపు కోల్పోయాక వికెట్లు తీయడానికి బౌలర్లు ఇబ్బంది పడ్డారు. హెన్రీ నికోల్స్ (113 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (94 నాటౌట్) అజేయ భాగస్వామ్యంతో కివీస్‌ను తొలి రోజు ముగిసే సమయానికి 243/5కు చేర్చారు.

కాంబోజ్ పేస్‌పై విమర్శలకు కౌంటర్..

యువ పేసర్ కాంబోజ్ 126-130 కి.మీ వేగంతోనే బౌలింగ్ చేయడంపై వచ్చిన విమర్శలను కోటక్ తోసిపుచ్చారు.

“పేస్ ముఖ్యమే, కానీ ఆటలో కొన్ని దశల్లో మాత్రమే. కాంబోజ్ వేగం 130, 128, కొన్నిసార్లు 126 చుట్టూ ఉంటుంది. అది ఫర్వాలేదు” అని అన్నారు.

ప్రసిద్ధ్ కృష్ణను కూడా కోటక్ వెనకేసుకొచ్చారు. “ప్రసిద్ధ్ దూకుడు బౌలర్, అతను కొన్ని పరుగులు ఇస్తాడని మాకు తెలుసు. వికెట్లు తీసినప్పుడు పొగుడుతాం, దెబ్బలు తిన్నప్పుడు విమర్శిస్తాం. అతడిని అలా చూడటం సరికాదు” అని అన్నారు.

పిచ్‌పై తేమ ఎండ వల్ల త్వరగా ఆవిరైందని, దీంతో బౌలర్లకు సహాయం తగ్గిందని, న్యూజిలాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడి ప్రశంసలకు అర్హులని కోటక్ అన్నారు.

“ఇది ట్రైలర్ మాత్రమే”: అశ్విన్ ఫైర్..

మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, సిరాజ్‌ను తప్పించడానికి వారం రోజులుగా కాదు, నెల రోజులుగా వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఎక్కువమంది చదివినది: రంజీకి కూడా పనికిరానోడు.. గంభీర్ మొండిపట్టుతో తొలి టెస్టులో ఛాన్స్.. ఎవరంటే?

“సిరాజ్‌ను తప్పించడానికి వారం రోజులుగా ఎందుకు వాతావరణం సృష్టించారు? వారం కాదు, నెల రోజులుగా జరుగుతోంది. ముందు వన్డేల్లో ఆడించలేదు. వన్డే వరల్డ్‌కప్ వస్తోంది, మీకు సిరాజ్ అవసరం లేదా? 2023 వరల్డ్‌కప్‌లో అతను ఎంత బలంగా ఉన్నాడు. ఆశ్చర్యపోకండి, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అది కూడా జరుగుతుంది” అని అశ్విన్ అన్నారు.

ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో 43 వికెట్లతో సిరాజే భారత అత్యుత్తమ బౌలర్ అని గుర్తుచేశారు. “ముందు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు రాసి, ఆ తర్వాత మరో ఇద్దరు సీమర్ల కోసం చూడండి. పోటీ ఎక్కడుంది? నాకు అర్థం కావడం లేదు” అని అన్నారు. 2027 వన్డే వరల్డ్‌కప్ జట్టులో కూడా సిరాజ్‌కు చోటు దక్కకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

మతం కోణం లేదు: గంభీర్ కోచ్..

ఇదిలా ఉండగా, సిరాజ్‌ను తప్పించడం వెనుక మతపరమైన కోణం ఉందన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలను గౌతమ్ గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ ఖండించారు. ఎంపిక పూర్తిగా క్రికెట్ అవసరాలు, జట్టు కూర్పు ఆధారంగానే జరిగిందని అన్నారు.

“ఇది నిరాధారం. భారత క్రికెట్ జట్టులో హిందూ-ముస్లిం కోణం లేదు. అందరూ భారతీయులే, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంభీర్ ఎప్పుడూ సిరాజ్‌కు మద్దతు ఇచ్చాడు. సిరాజ్ తుది జట్టులో లేకపోతే అది జట్టు అవసరాల వల్లే. ఎంపిక జట్టు కూర్పు, ఆటగాళ్ల పాత్రలు, ప్రదర్శనపై ఆధారపడుతుంది. గంభీర్‌కు ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవు” అని భరద్వాజ్ ఐఏఎన్‌ఎస్‌తో అన్నారు.

“అతడి పేరు సిరాజ్, అది చాలు కదా? ప్రదర్శన చేస్తున్నా ఎంపిక కాకపోతే మరే కారణం ఉంటుంది?” అని ఇమ్రాన్ మసూద్ ప్రశ్నించిన నేపథ్యంలో భరద్వాజ్ ఈ వివరణ ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us