AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పాము నోటిలోంచి వెళ్తే లోపల అద్భుత లోకం.. తెలంగాణలోని ఈ గుడి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

పాము నోటిలోంచి దాని కడుపులోకి నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా, ఇలాంటి ఓ అద్భుతమైన ఆలయం మన తెలంగాణలోనే ఉంది.. చుట్టచుట్టుకున్న భారీ సర్పం ఆకారంలో కొండపై నిర్మించిన ఈ గుడి చూసేవారిని కట్టిపడేస్తుంది. వేములవాడకు అతి సమీపంలో ఉన్న నాంపల్లి గుట్ట స్నేక్ టెంపుల్ విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: పాము నోటిలోంచి వెళ్తే లోపల అద్భుత లోకం.. తెలంగాణలోని ఈ గుడి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Nampally Gutta Snake Temple
Krishna S
|

Updated on: Nov 20, 2026 | 5:07 PM

Share

తెలంగాణలో ఎన్నో అద్భుతమైన, పురాతన ఆలయాలు ఉన్నాయి. అయితే నిర్మాణ శైలితోనే భక్తులను మంత్రముగ్ధులను చేసే ఓ ప్రత్యేక ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొలువై ఉంది. అదే వేములవాడకు అతి సమీపంలో ఉన్న నాంపల్లి గుట్ట స్నేక్ టెంపుల్. కొండపై చుట్టచుట్టుకున్న భారీ సర్పం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం చూసేందుకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. వేములవాడకు సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన కొండపై ఈ నాంపల్లి గుట్ట ఆలయం ఉంది. సాధారణ ఆలయాలకు భిన్నంగా, ఒక భారీ పాము చుట్టచుట్టుకుని ఉన్న ఆకారంలో దీనిని నిర్మించారు. ఆలయ ప్రవేశ ద్వారం ఒక పొడవైన, కాస్త చీకటిగా ఉండే సొరంగంలా ఉంటుంది. పాము నోటి ద్వారా దాని శరీరం లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా దీనిని తీర్చిదిద్దారు. బయటి ప్రపంచం నుండి ఒక ఆధ్యాత్మిక లోకంలోకి అడుగుపెడుతున్న అనుభూతిని ఈ నిర్మాణం కలిగిస్తుంది.

గర్భగుడిలో లక్ష్మీ నరసింహ స్వామి.. పైన శ్రీకృష్ణుడు

ఈ సొరంగ మార్గం గుండా లోపలికి వెళ్లగానే ప్రధాన గర్భగుడిలో రాతిపై చెక్కిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. దీనితో పాటు ఈ క్షేత్రం నాగ దేవతకు కూడా అంకితం చేయబడింది. సొరంగ మార్గంలో నడుస్తున్నప్పుడు గోడలపై భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడి కథను తెలిపే అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. నరసింహ స్వామి అవతార విశేషాలను ఇవి కళ్లకు కడతాయి. ఈ భారీ పాము తల భాగంపై వేణువు ఊదుతున్న శ్రీకృష్ణుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది కాళీయ మర్దన ఘట్టాన్ని గుర్తుచేస్తూ, ఆలయ నిర్మాణానికి మరింత ఆధ్యాత్మిక శోభను ఇస్తుంది.

ఎలా చేరుకోవాలి? సందర్శన వేళలు ఏంటి?

కొండపై ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు కొన్ని వందల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు 15 నిమిషాల సమయం పడుతుంది. కొండపైకి చేరుకున్నాక చుట్టూ ఉన్న రాతి బండలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఈ ఆలయం ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు సమీపంలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే చారిత్రక ఎలగందల్ కోటను కూడా సందర్శించవచ్చు.

వీడియో చూడండి..

Follow Us